ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు జరగనున్నాయి. నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసీ) సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపి నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ రాలేదు.
ఈనెల 26 వరకూ సభ సమావేశం కానుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా లేక రాబోయే మూడు నెలలకు మాత్రమేనా అనేది తేలాల్సి ఉంది. బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశపెట్టిన తరువాత ఈ శ్వేత పత్రాలపై చర్చ చేపడతారు.
ఎల్లుండి ఢిల్లీలో చేపట్టబోయే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళుతున్నారు. వారు 24న తిరిగివచ్చే అవకాశం ఉంది, చివరి రెండ్రోజుల పాటు మాత్రమే వారు సభా కార్యక్రామాలకు హాజరు కానున్నారు.