ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని హితవు పలికారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పలు అంశాలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. శాంతి భద్రతల విషయంలో కచ్చితంగా ఉంటానని, రాబోయే రోజుల్లో ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు.
జగన్ తన సహజ ధోరణిని వీడలేదని.. తప్పులు చేయడం, పక్కవారిపై నేట్టేయడం అలవాటేనని బాబు వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. మదనపల్లెలో గత రాత్రి రెవెన్యూ రికార్డులు దగ్ధం ఘటనను కూడా బాబు ఈ భేటీలో ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో వ్యవస్థలు సరిగా పనిచేయలేదనడానికి ఈ ఘటనే తార్కాణంగా నిలుస్తుందన్నారు. అర్ధరాత్రి ఈ సంఘటన జరిగితే పొద్దున వరకూ జిల్లా యంత్రాంగం సరిగా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ అనే నేను, జనసేన నుంచి 100% మద్దతు ఉంటుందని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.