మలయాళం మేకర్స్ అక్కడి ప్రేక్షకులు సహజత్వంతో కూడిన కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆకాశంలో నుంచి ఊడిపడే కథలకంటే తమ మధ్యలో నుంచి పుట్టే కథలను వాళ్లు ఎక్కువగా ఆదరిస్తారు. అలా మలయాళంలో రూపొందిన వెబ్ సిరీస్ గా ‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సిరీస్ ‘హాట్ స్టార్’ లో అందుబాటులోకి వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది.
ఈ కథలో హీరో నాగేంద్ర .. అతనికి పెళ్లంటే భయం. పెళ్లంటే ఒక బాధ్యత .. భార్యను పోషించాలంటే తాను కష్టపడి పనిచేయాలి. తనకి ఇష్టంలేని విషయం తాను కష్టపడటమే. అందువలన అతను పెళ్లికి దూరంగా ఉంటాడు. అయితే దుబాయ్ వెళ్లి పెద్దగా కష్టపడకుండా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకురావాలనే ఒక ఆశ మాత్రం అతనికి ఉంటుంది. అందుకు అవసరమైన డబ్బు కావాలంటే పెళ్లి చేసుకోక తప్పదనే నిర్ణయానికి వస్తాడు. అలా వచ్చిన కట్నం డబ్బుతో దుబాయ్ చెక్కేయాలని చూస్తాడు.
అయితే కట్నం డబ్బు సమకూరకపోవడంతో, ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. అలా వివిధ ప్రాంతాలకి చెందిన ఐదుగురు యువతులను వివాహం చేసుకుంటాడు. అయితే వాళ్లలో మానసికస్థితి లేనివారొకరు .. వేశ్య ఒకరు .. హంతకురాలు ఒకరు ఉంటారు. వాళ్లను నాగేంద్రన్ పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆ తరువాత ఆయన పడిన పాట్లు ఎలాంటివి? అనేది వినోదభరితంగా సాగుతుంది.