Saturday, January 18, 2025
HomeTrending Newsబడ్జెట్ కేటాయింపుల్లో మతలబు... కెసిఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి

బడ్జెట్ కేటాయింపుల్లో మతలబు… కెసిఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి

విపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేతలకు పొంతన లేదు. కెసిఆర్ విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి….ఇప్పుడు కెసిఆర్ మార్గంలోనే సాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

కమీషన్లు వచ్చే శాఖలకు అధిక నిధులు కేటాయించిన ప్రభుత్వం దేశ భవిష్యత్తుకు చోదక శక్తి లాంటి విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు వస్తున్నాయి. వైద్య రంగంలో మెడికల్ కళాశాలలకు నిధులు కుమ్మరించిన ప్రభుత్వం దవాఖానాల ఆధునీకరణ సంగతి సరే సిబ్బంది భర్తీని పక్కన పెట్టింది. కెసిఆర్ హయం నుంచి ఇప్పటివరకు ఆధునిక వైద్య పరికరాలు సమకురుస్తున్నా… వాటిని వినియోగించే సాంకేతిక సిబ్బంది నియామకాలు జరగటం లేదు.

వైద్య కళాశాలలలో ఉన్నతస్థాయి సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది నియామకాలు మాత్రం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.

Colleges Telangana

విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలలో వైస్‌ చాన్స్‌లర్ల నియామకం కోసం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల్లో తాత్కాలికంగా ఐఏఎస్‌లను ఇన్‌చార్జులుగా నియమించారు. 15 రోజుల్లో వీసీల నియామకం పూర్తి చేస్తామని, వర్సిటీలను అన్నివిధాలుగా ఆదుకుంటామని మాటిచ్చి బడ్జెట్లో మరచిపోయారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా, ఇంతవరకు వీసీల నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సుమారు 1,500 వరకు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. నెలనెలా ఉద్యోగ విరమణలతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది.

వర్సిటీల అభివృద్ధి, పరిశోధనలు, మౌలిక సదుపాయాలు వంటి వాటి కోసం ప్రతిపాదనే లేదు. 12 విశ్వవిద్యాలయాలకు 500 కోట్లు కేటాయించారు. అందులో 200 కోట్లు OU, మహిళా విశ్వద్యాలయలకే కేటాయించారు. మిగిలిన పది వర్సిటీలకు కేవలం 300 కోట్లు.

విద్యా రంగానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న అధికార పార్టీ నేతలు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ మొత్తమే అని తేలింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే సిఎం రేవంత్ రెడ్డి నైజం బయట పడుతుంది.

పైన పేర్కొన్న బడ్జెట్ కేటాయింపులు రెండేళ్ళ క్రితంవి కాగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 7.3 శాతమే కేటాయించటం విడ్డూరం. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. అందుకే ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని బిసి సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీల అభివృద్ధి, విద్యా వికాసానికి తగు చర్యలు తీసుకోవాలని సీనియర్‌ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్