కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ సమావేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్షించారు. సహజంగా ప్రభుత్వాలు సాఫ్ట్ వేర్ ఎగుమతులు, కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు భూముల కేటాయింపుపైనే అలోచిస్తుంటాయి. కానీ కరోనా తరువాత పని గంటల్లో పెరుగుదల, తీవ్రమైన ఒత్తిడితో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పలు రకాల మానసిక-ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యే సభలో ప్రస్తావించారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అదృష్టవంతులని అందరూ అనుకుంటారని… కానీ వారు చూస్తున్నంత నరకం అలవి కానిదని… తనకు తెలుసు కాబట్టి చెబుతున్నానని అన్నారు. ఈ రంగం వల్ల ప్రభుత్వానికో, ఆయా కంపెనీలకో డబ్బులు బాగా వస్తుండవచ్చని అన్నారు. మరోవైపు ఈ రంగంలో ఉద్యోగులకు కూడా జీతాలు బాగానే వస్తుంటాయని.. కానీ అది కొంతకాలం మాత్రమేనని… నడుములు పోతుంటాయని… వారు మరే ఇతర వృత్తి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం దీనిపై అలోచించి ఒక విధానాన్ని ప్రవేశపెట్టి, పని గంటలను నియంత్రించాలని.. లేకపోతే ఇబ్బందులు తప్పవని… పైన వెలుగులు చూసి సంతోషపడుతున్నామని, లోపలి పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోతున్నామని అన్నారు. దీనిపై ఓ సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.