Thursday, November 21, 2024
Homeఫీచర్స్శిథిలమైన సామాన్య బతుకుచిత్రానికి అక్షర రూపం

శిథిలమైన సామాన్య బతుకుచిత్రానికి అక్షర రూపం

ఆసాంతం ఆసక్తితో చదివించి అనురక్తి కల్గించిన ఓ పుస్తకం.. రాజులు, రాజ్యాలు, యుద్ధాల మధ్య మెయిన్ సబ్జెక్టైన ప్రేమకథకు ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నారోనన్న ఉత్కంఠ.. వెరసి, 132 పేజీలన్నీ ఆపకుండా తిప్పేస్తూ చదివించిన నవల ప్రణయ హంపీ!

ముందుగా మారుతీ పౌరోహితం గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.

మొఘల్ ఈ ఆజామ్ దర్శకుడు కే. ఆసిఫ్ ఉండి ఉంటే మొదటి ఛాయిస్ ఆయన… ఇప్పుడైతే, సోల్ ను సరిగ్గా పట్టుకుని తీయగల్గితే రెండో ఛాయిస్ సంజయ్ లీలా భన్సాలీ.. వీరు మాత్రమే సినిమాగా మల్చగల కథనం ప్రణయ హంపీ!

ఇదీ నా వ్యక్తిగత అభిప్రాయమే! ఇంకెవరైనా అంతకుమించీ తీసే అవకాశాలుండొచ్చు!!

మొత్తంగా సినిమాగా మలిస్తే తప్పకుండా ఓ దృశ్యకావ్యమయ్యే నవల!

చాలామంది చదువరులు, నిశిత పరిశీలకులు, విమర్శకులు, సాహితీ అభిమానులు ఇప్పటికే ప్రణయ హంపీ నవల గురించి ఎంతో బాగా సమీక్షించారు. నవల ముందుమాటలోనూ ఆ సమీక్ష మనల్ని నవలను కచ్చితంగా చదవాలనిపించేలా చేస్తుంది. కాబట్టి, కొత్తగా నవల గురించి చెప్పేదేమీ లేదు. కానీ, నాబోటివాడు మొదటిసారి ఓ నవలను ఆపకుండా చదవడం మాత్రం మారుతీ పౌరోహితం గారు చేయించారు.

హంపీ విజయనగరమంటే శ్రీకృష్ణ దేవరాయలు.. అష్ఠ దిగ్గజాలైన అల్లసాని పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, ధూర్జటి వంటివారి పాండిత్యం.. నాటి రాయలకాలపు రాజ వైభోగం.. వీథుల్లో రాళ్ల మాదిరిగా రత్నాలు పర్చేవారని చదివిన ఎరుక.. ఇగో ఇవి మాత్రమే చాలామంది చదువుకున్న చరిత్ర.

కానీ, ఆ చరిత్ర కింద శిథిలమైన సామాన్య బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఓ గొప్ప ప్రయత్నం ప్రణయ హంపీ!

సంబజ్ఞగౌడ, ముద్దుకుప్పాయి ప్రేమకథను ఓ మెయిన్ సబ్జెక్టుగా ఫోకస్ చేసి… ఒకింత విచారంతో మొదలైన వారి ప్రేమకథ ఏ తీరం చేరుతుందోనన్న ఉత్కంఠ రేకెత్తించారు రచయిత. వలంది వంటి వ్యక్తిత్వాలు తమ ప్రమేయం లేకుండానే.. ఈ సమాజ చిన్నచూపులో ఎలా భాగమైపోతారోనన్న ఒకింత ఆర్తిని.. ఆ జీవితం విషాదంతో ముగిసే విధానాన్ని రచనలోనే కెమెరా కన్ను పెట్టినట్టు దృశ్యరూపకం చేయడం రచయిత భావవ్యక్తీకరణ గొప్పదనం. అలా, ఎక్కడా బిగి సడలకుండా మైమరిపించే కథనం ప్రణయ హంపీ!

ఇలాంటి బుక్స్ ప్రచురిస్తున్నవారికీ.. ఎవరు చదువుతారో, లేదోనన్న లెక్కలు వేసుకోకుండా తమ రైటప్ లో తాదాత్మ్యం పొందుతూ మనసు పెట్టి రాసి.. పుస్తక ప్రేమికులను అలరిస్తున్న రచయితలకు అభినందనలు.

పాఠకుల హృదయాలను పరవశింపజేసే ఇలాంటి కావ్యశిల్పం ఉన్నంతవరకు.. సాహిత్యం ఒక వెలుగు వెలుగుతుందన్నది ఘంటాపథం!

మొత్తంగా మారుతీ పౌరోహితం గారి ప్రణయ హంపీ… నేను చదివిన సమకాలీన నవలల్లో ఓ విజయ హంపీ!!

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్