రాబోయే ఐదేళ్ళలో లక్షా 64 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందించబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్ళలో 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు డిబిటి రూపంలో ఇచ్చామని చెప్పుకున్నారని, బటన్ నొక్కడం తప్ప ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించిన పరిస్థితులు లేవని… ఎప్పుడైనా మీటింగ్ లు పెడితే బలవంతంగా ప్రజలను తీసుకు వచ్చిన సందర్భాలు ఉండేవని వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం బాబు ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రతినెలా ఒకటో తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద ప్రజలతో మమేకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఓ నిరుపేదను కలిసి వారి సమస్యలను అర్ధం చేసుకుంటే మన మైండ్ లో అది పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలుకు కట్టుబడి ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. ఈనెల 15న అన్నా క్యాంటిన్లు మొదలు పెడుతున్నామని…మిగిలిన వాటిని కూడా ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు వాటిని అమలు చేయాలో చేస్తామని వివరించారు. జిల్లా కలెక్టర్లు కేవలం ఆఫీసులో ఉండేందుకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా పని చేయాలన్నారు. కేవలం జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్లి అక్కడి స్థితిగతులు తెలుసుకుంటే మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదం చేస్తుందన్నారు. తాను కూడా త్వరలో ఆకస్మిక పర్యటనలకు వస్తానని, ఈమధ్య కాలంలో చెబుతున్నట్లుగా 1995 నాటి సిఎంను చూస్తారని చెబుతున్నానని…. ఆ స్పీడ్ కు తగ్గట్లుగా అధికారులు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, అధికారుల ద్వారా ప్రజలకు పని చేయాల్సి ఉంటుందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రజలకు, గ్రామాలకు కావాల్సిన కనీస అవసరాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగాల కల్పన అత్యంత ప్రాధాన్య అంశమని… ఎంత పెట్టుబడులు వచ్చాయనేదానికంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామనేదే ముఖ్య మైన అంశమని తేల్చి చెప్పారు. వివిధ శాఖలు, పథకాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు.