Thursday, September 19, 2024
HomeTrending Newsఅర్ధాంగికి చీరలు కొన్న చంద్రబాబు

అర్ధాంగికి చీరలు కొన్న చంద్రబాబు

దాదాపు 30 ఏళ్ళ తరువాత టిడిపి అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య కోసం చీరలు కొనుగోలు చేశారు. నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాబు వివిధ స్టాళ్ళను పరిశీలిస్తూ వాటిలో ఉప్పాడ, ధర్మవరం చేనేత కార్మికులు నేసిన రెండు చీరలను తన అర్ధాంగికి కొన్నారు.

గత సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్టు సమయం నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఫిబ్రవరి 19న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్న ఆమె  తన భర్త చంద్రబాబుకు ప్రజలే తొలి ప్రాధాన్యత అని… కుటుంబం ఆ తరువాతేనని చెప్పారు. తనకు ఆయన  ఓ చీర కొనిచ్చి దాదాపు 30 ఏళ్ళు అయి ఉంటుందని… నాడు తెచ్చినప్పుడు కూడా తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యిందని…. తీరా చీర చూస్తే భయంకరంగా ఉందని… దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నానని సరదాగా చెప్పారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత జరిగిన తొలి చేనేత దినోత్సవంలో రెండు చీరలు కొనడం ఆసక్తి కలిగించింది.

అప్పట్లో భువనేశ్వరి వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకునే ఆమెకు ఓ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే బాబు ఈ చీరలు కొన్నారని అనుకోవచ్చు. చీరలు కొన్న తరువాత  ఆయా స్టాళ్ళ యజమానులకు ఆయనే స్వయంగా డబ్బులు ఇచ్చారు.  గతానికి భిన్నంగా చంద్రబాబు ఇటీవలి కాలంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారితో కొంత సమయం గడుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్