ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసి, డప్పు వాయించారు. గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు పండించటానికి, తయారు చేయటానికి, గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ఉత్సాహపరిచారు. ఆదివాసీలు, ప్రజాప్రతినిధులతో కలిసి కాఫీ రుచి చూశారు.
“అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజన సోదరులకు నా శుభాకాంక్షలు. జనజీవన ప్రధాన స్రవంతిలో గిరిజనులు భాగస్వాములు కావాలనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో ఒకటి. అందుకే నాటి తెలుగుదేశం హాయంలో వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించాం. అరకు కాఫీకి, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ప్రోత్సాహాన్ని అందించాం. గిరిజన జాతులను కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని సమున్నతంగా నిలబెట్టడమే. రాబోయే రోజుల్లో కూడా గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడతామని, గిరిజనులకు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్ ను అందిస్తామని తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.