Thursday, December 12, 2024
HomeTrending Newsఖైదీలకు ఎస్కార్ట్ పోలీసుల రాచమర్యాదలు

ఖైదీలకు ఎస్కార్ట్ పోలీసుల రాచమర్యాదలు

పలుకుబడి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ స్థాయి నేతలు జైలుకు వెళ్ళటం మొదలయ్యాక జైల్లో ముఖ్యనేతలకు ప్రత్యేకంగా బ్యారక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా జైళ్ళు ఉన్నాయి. లోపల ఏం జరుగుతోందో లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక.

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ స్లోగన్ బాగా పాపులర్ అయింది. అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సిన పోలీసులు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని నయాగారా హోటల్ వద్ద ఖైదీలకు ఎస్కార్ట్ పోలీసుల రాచమర్యాదలు చేయటం చూసి దారిన పోతున్న వారు అవాక్కయ్యారు.

కోర్టు నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్ళకుండా… హోటల్ వద్ద అపి ముగ్గురు ఖైదీలకు ఇరానీ టీ తాగించి వారి కోరిక తీర్చారు. ఆ తర్వాత జైలుకు సాగనంపిన పోలీసుల తీరు విమర్శలకు దారి తీసింది.

ముగ్గురితో కూడిన పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఒక చేతికి బేడీలతో ఉన్న ముగ్గురు ఖైదీలు ఎంచక్కా కూర్చొని టీ సేవించారు. సుమారు 10-15 నిమిషాలపాటు హోటల్ ముందే గడిపారు.

పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. జైలుకు తరలిస్తున్న ఖైదీలకు హోటల్ టీ ఇస్తారా? ఆని దుమ్మెత్తిపోస్తున్నారు.

బయటి ఆహారం తీసుకోవటం ద్వారా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు.. రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఖైదీలను ఉంచటం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తే..తద్వారా ఉత్పన్నం అయ్యే పరిణామాలకు ఎవరు జవాబు దారి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఒకవేళ పోలీసులే పని ఒత్తిడి తాళలేక తేనీరు తీసుకోవాలన్నా దానికి మార్గం లేకపోలేదని న్యాయ నిపుణులు చెపుతున్నారు. పోలీసులు టీ తీసుకొని మానవతా దృక్పథంతో ఖైదీలకు కూడా ఇప్పించారని అనుకున్నా… వీడియో చూస్తే అక్కడ మరో విధంగా ఉందని నెటిజన్లు వాపోతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్