తనకు సినిమాల కంటే దేశ హితం, సమాజమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “సినిమాలు- రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా… సినిమాలు సినిమాలే.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నాకు దేశం ముఖ్యం సినిమాలకంటే కూడా” అని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసురావారిపల్లెలో జరిగిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్ననారు. ఈ సందర్సంభంగా అభిమానులు ఓజీ-ఓజీ (పవన్ సినిమా) అని నినాదాలు చేశారు, వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకమని, గ్రామస్థాయి నుంచే దేశభక్తి పెంపొందాలని సూచించారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, స్వర్ణ గ్రామాల అభివృద్ధి తన లక్ష్యమని, సినిమాలను రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తానని, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయని… గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
గతంలో స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో గ్రామాలకు, రూ. 100, 200 మాత్రమే ఖర్చుల కోసం ఇచ్చేవారని దాన్ని తాము రూ.10 వేలు, 25 వేల రూపాయలకు పెంచామని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల్లో మెజార్టీ 70% శాతం వరకూ వైసీపీ తరఫున గెలిచినవారే ఉన్నారని, అయినా సరే తాము ఎలాంటి పక్షపాతం చూపలేదని వెల్లడించారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు. గ్రామ సభల తరహాలోనే భూ సమస్యల కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గ్రామ సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించొచ్చని అన్నా హజారే నిరూపించారని… అలాంటిది 13 వేలకు పైగా గ్రామ సర్పంచ్ లు నడుం బిగిస్తే రాష్ట్రం కొన్ని రోజుల్లోనే అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. అన్నా హజారే స్ఫూర్తితోనే చిరంజీవి ‘రుద్రవీణ’ సినిమా తీశారని పవన్ అన్నారు,
తనకు ప్రజాభిమానం ఉన్నా.. పరిపాలన అనుభవం లేదని అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడుస్తున్నానని తెలిపారు. విజ్ఞానం ఉన్న వారి దగ్గర నేర్చుకోవడాన్ని తక్కువగా చూడనని పవన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా.. ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేంత అనుభవం చంద్రబాబు సొంతం అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకుంటే జవాబుదారీ తనం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ అభివృద్ధికి ప్రజలే చొరవ తీసుకోవాలన్నారు. గ్రామస్థుల్లో చైతన్యం రాకుంటే తనలాంటి వారు 10 వేల మంది వచ్చినా ప్రయోజనం లేదన్నారు. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.