విశ్రాంత ఇంజినీర్ కన్నయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా నియమించింది. 90 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ అమర్చడంలో కీలకపాత్ర పోషించారు. భారీ నీటి ప్రవాహలోనూ ఎంతో శ్రమకోర్చి స్టాప్ లాగ్స్ ఏర్పాటు చేసి నీరు వృథా కాకుండా చేసి రైతులు, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రశంసలు అందుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివి చెన్నైలో ఉద్యోగం చేశారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 260కి పైగా ప్రాజెక్టులకు క్రస్ట్ గేట్లను డిజైన్ చేశారు.
ఆగస్ట్ రెండో వారంలో దక్షిణ భారత దేశంలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంలో 19వ గేట్ కొట్టుకుపోయింది. నీరు వృథాగా పోతుండడంతో ఇరురాష్ట్రాల అధికారులు కన్నయ్య నాయుడును సంప్రదించారు. ఆ గేటు స్థానంలో ‘స్టాప్లగ్’ ఏర్పాటుచేసి తన పనితనం చాటిచెప్పారు. ఆ తర్వాత ఆ గేటుకు రిపేర్లు చేసి పంటలను కాపాడగలిగారు. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. డ్యామ్ నుంచి దాదాపు 60 టిఎంసి నీటిని విడుదల చేస్తే తప్ప స్టాప్ లాగ్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితిలో అధికారులు అత్యంత సమర్థవంతంగా పనిచేసి నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలోనే స్టాప్ లాగ్ గేటు అమరిక ప్రక్రియ ప్రారంభించారు. ఎపికి చెందిన రిటైర్డ్ అధికారి కన్నయ్యనాయుడు నేతృత్వంలో యుద్ద ప్రాతిపదికన గేట్లు డిజైన్లు చేయించి పనులు మొదలు పెట్టారు. మూడు భాగాలుగా చేపట్లే ఈ ప్రక్రియలో మొదటి భాగాన్ని విజయవంతంగా కొద్ది సేపటి క్రితం పూర్తి చేశారు. గేటు అమరిక విషయంలో ఎపి ప్రభుత్వం కర్నాటక ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందించింది. గేట్ అమరిక పరిణామాలను అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీటి ప్రవాహం ఉన్న సమయంలో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చడాన్ని చంద్రబాబు అభినందించారు. సమిష్టి కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన సిబ్బంది, కార్మికులు, అధికారులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో ముందుకు వచ్చి పనిచేసిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుకు సిఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.