Thursday, November 21, 2024
HomeTrending Newsరంగంలోకి నేవీ హెలీకాప్టర్లు

రంగంలోకి నేవీ హెలీకాప్టర్లు

భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది.  వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మూడు హెలీకాప్టర్లు రాగా మరో నాలుగు మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నాయి.  వరద ముంపు ప్రాంతాల్లో హెలీకాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందించారు.  నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు అధికార యంత్రాంగం మొదలుపెట్టింది. ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలిస్తున్నారు.

బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై  మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ల ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకుని మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు,  ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారంపైనా ఆరా తీశారు.  పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని, బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని,  ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని,  సమస్యను రెండుమూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్