ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు క్రమంగా పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కు కొత్త చైర్మన్ ను నియమించారు. కొత్త చైర్మన్ గా హాజీ మహమ్మద్ ఇద్రిస్ ను నియమిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. హాజీ మహమ్మద్ ఇద్రిస్ గతంలో తాలిబాన్ ఆర్థిక కమిషన్ వ్యవహారాలు చక్కబెట్టే వారు.
ఈ నెల 31 వ తేది నాటికి అమెరికా, నాటో బలగాలు పూర్తిగా వైదోల్గానున్నాయి. వారు వెళ్ళిన పిమ్మట ఆఫ్ఘన్ పాలనా, వివిధ నాయకుల బాధ్యతలను ప్రకటిస్తారని సమాచారం. అయితే ప్రస్తుత గందరగోళ వాతావరణంలో అన్ని సంస్థలు మూతపడ్డాయి. అయితే బ్యాంకింగ్ రంగం దెబ్బ తింటే కష్టమని భావించిన తాలిబన్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబుల్ లో ఏ.టి.ఎం లు పని చేయక, బ్యాంకులు తెరుచుకోపోవడంతో వారం రోజులుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ బ్యాంకులు నిన్నటి నుంచి సేవలు అందిస్తున్నా, ప్రైవేటు బ్యాంకులు ఇంకా తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తలెత్తకుండా తాలిబన్లు ఇద్రిస్ నియామకాన్ని ఆఘమేఘాల మీద ఖరారు చేశారు.