ఆహా’ ఓటీటీ వైపు నుంచి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త సినిమాలు చాలా వేగంగా ఈ ట్రాక్ పైకి దూసుకుని వస్తున్నాయి. తమిళ .. మలయాళ అనువాదాలతో పాటు, తెలుగు సినిమాలు కూడా వరుసగా వదులుతూనే ఉన్నారు. అలా ఈ నెల 20వ తేదీన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఇక త్వరలో ‘తిరగబడరా సామీ ‘ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా జంటగా నటించిన ఈ సినిమాకి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. భోలే షావలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే అంతగా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ కి చెప్పుకోదగిన హిట్ లేదు. అలాంటి సమయంలో ఆయన నుంచి వరుసగా వచ్చిన సినిమాలలో ఇది ఒకటి.
ఈ సినిమాలో కథానాయకుడు చిన్నప్పుడు ఒక జాతరలో తప్పిపోతాడు. అలా తల్లిదండ్రులకు దూరమైపోయిన అతను, హైదరాబాద్ లో మరొకరి దగ్గర పెరుగుతాడు. తల్లిదండ్రులకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో తెలిసిన అతను, తప్పిపోయినవారిని వారి ఇళ్లకు చేర్చడమే పనిగా పెట్టుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఫలానా వారిని వెతికి పెట్టమని అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ అతణ్ణి ఎలాంటి కష్టాల్లోకి నెట్టింది అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.