మలయాళంలో ఈ మధ్య కాలంలో విజయవంతమైన సినిమాలలో ‘నూనక్కుజి’ ఒకటి. బాసిల్ జోసెఫ్ .. నిఖిలా విమల్ .. గ్రేస్ ఆంటోని .. సిద్ధిఖీ తదితరులు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 15వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ లాభాలలో పడటానికి పెద్దగా సమయం తీసుకోలేదు. బ్లాక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా రీసెంటుగా తెలుగు వెర్షన్ తో పాటు జీ 5లో అందుబాటులోకి వచ్చింది.
పెద్దగా ఖర్చు చేయకుండా .. భారీతారాగణం లేకుండా కథను ఎంత సింపుల్ గా చెప్పాలో .. ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలో జీతూ జోసెఫ్ కి బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమైపోతుంది. అదే పంథాలో ఆయన తెరకెక్కించిన మరో సినిమానే ‘నూనక్కుజి’. ఓ పది పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో సంచరించే ఈ పాత్రలు ఒకే లైన్ మీదకి వచ్చేస్తాయి. అప్పటి నుంచి అసలైన సందడి మొదలవుతుంది.
ఈ కథలో హీరో ల్యాప్ టాప్ లో ఒక ప్రైవేట్ వీడియో ఉంటుంది. అది భార్యతో తాను గడిపిన మధుర క్షణాలకు సంబంధించినదే. అయితే ఆ ల్యాప్ టాప్ ను ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ తీసుకుని వెళ్లిపోతారు. వాళ్లు ఆ వీడియో చూసేలోగా, దానిని వారి నుంచి కొట్టేయాలనేది అతని ప్లాన్. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది కథ. పెళ్లి .. అపార్థాలు .. అక్రమసంబంధాలను కామెడీ యాంగిల్ లో టచ్ చేస్తూ సాగే ఈ సినిమా హాయిగా నవ్విస్తుంది.