ప్రభాస్ కథనానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి ఒక సినిమాను రూపొందించనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. యుద్ధం నేపథ్యలోనే కొనసాగే కథ ఇది. గతంలో హను రాఘవపూడి నుంచి వచ్చిన ‘సీతారామం’ కూడా యుద్ధం నేపథ్యంలో నడిచే ప్రేమకథనే. కథాకథనాలు .. పాటల పరంగా ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే యుద్ధం నేపథ్యంలో నడిచే మరో కథను హను రాఘవపూడి తయారుచేసుకున్నాడు.
అయితే యుద్ధం నేపథ్యమే తప్ప మిగతా అంశాల విషయంలో ఇది పూర్తిగా భిన్నమైన రూట్లో వెళుతుంది. ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించే ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా ‘ఇమాన్వి’ అలరించనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో మరో కథానాయికగా కూడా కనిపించనుందనేది తాజా సమాచారం. అందుకోసం ఒక స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు.
ప్రభాస్ సరసన రెండో కథానాయికగా మెరిసేది ఎవరబ్బా అనే ఒక ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ లోగా ప్రభాస్ నుంచి ‘రాజా సాబ్’ ప్రేక్షకులను పలకరిస్తుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, చాలావరకూ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. నిధి అగర్వాల్ .. రిద్ధి కుమార్ .. మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపంచే ఈ సినిమా, వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.