చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, తాను అవినీతికి పాల్పడ్డానంటూ టిడిపి నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు. తాను నిజాయతీగా పని చేస్తున్నానని, అవినీతికి పాల్పడలేదని…. ఈ విషయమై కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేసేందుకైనా రెడీగా ఉన్నానని, చంద్రబాబు కూడా ప్రమాణం చేయడానికి రావాలని, తన సవాల్ స్వీకరిస్తారా ఛాలెంజ్ చేశారు.
టిడిపి నేతల ఆరోపణలపై సిబిఐ విచారణకు అయినా సిద్ధమని అయన స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని అయన ప్రకటించారు. దళితుల కోసం చంద్రబాబు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని, రెండేళ్ళ రెండు నెలల కాలంలో సిఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని నారాయణ స్వామి వివరించారు.
రెండ్రోజుల క్రితం నారాయణస్వామి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీచేస్తే కనీసం రెండు సీట్లు కూడా గెలేవలేరంటూ చంద్రబాబును, లోకేష్ ను ఎద్దేవా చేశారు. ఒకవేళ రెండు సీట్లు గెలిస్తే బాబు ఇంట్లో పాచీపని చేసేందుకైనా తయారుగా ఉంటానని సవాల్ చేశారు. దీనిపై టిడిపి నేతలు స్పందించారు. ముందు తన శాఖలో సరిగా పని చేయాలంటూ హితవు పలికారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి జరుగుతోందని దానిపై దృష్టి పెట్టాలంటూ ప్రతి విమర్శలు చేశారు.