తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కుడా అదేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలే ఆ లక్ష్యాన్ని చేరుస్తుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలసి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యవసాయ గోడౌన్,రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయంలో విప్లవాత్మక మైన మార్పులు సంభవించాయన్నారు. అందుకు తగ్గట్లుగా పంటల పద్ధతుల్లో మార్పు రావాలని ఆయన చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ రంగం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ఆయన కొనియాడారు. ఒక్కసారి 2014 కు పూర్వం లోకి వెడితే ఆ మార్పు ఇట్టే తెలిసిపోతుందన్నారు.గణాంకాల జోలికి వెళ్లడం లేదని తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన రోజున వెకిలి మాటలు,వేటకారాలు మాట్లాడిన వారిలో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు.ఉద్యమం మొదలు పెట్టిన రోజున స్వరాష్ట్రంలో మొదలు లబ్ది పొందేది వ్యవసాయం అన్నప్పుడు నొసలు చిట్లించిన వారే స్వరాష్ట్రం లో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అన్న రోజున కుడా అవే వెకిలి మాటలు ,వేటకారాలు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ స్థానిక జడ్ పి టి సి,యం పి పి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.