ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదని అనకాపల్లి శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. 14 ఏళ్ళ చంద్రబాబు పాలనలో –ఏడున్నరేళ్ళ వైఎస్, జగన్ పాలనలో (ఐదున్నర ఏళ్ళ వైఎస్ పాలన – రెండేళ్ళ జగన్ పాలన) ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని అయన సవాల్ విసిరారు. విశాఖపట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమరనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రేపు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న చర్చావేదిక కార్యక్రమాన్ని అమరనాథ్ తప్పుబట్టారు.
ఉత్తరంధ్రను కేవలం ఓటుబ్యాంకు గానే టిడిపి వాడుకుందని, ఏనాడూ ఈ ప్రాంత సమగ్రాభివృద్ధిపై ఆలోచించలేదని అమరనాథ్ విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఉత్తరాంధ్రకు కనీసం ఒక మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని, కానీ జగన్ ప్రభుత్వం రెండేళ్ళలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి ఒకటి, విజయనగరం జిల్లాకు మరొకటి మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో మరో కాలేజీ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని గుడివాడ వివరించారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా సిఎం జగన్ ఏర్పాటు చేస్తే కనీసం స్వాగతించలేని నేతలు ఇప్పుడు ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో చర్చా వేదిక ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు, కేవలం రాజకీయాల కోసం, ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం ఉత్తరాంధ్ర ప్రజలను వాడుకోవద్దని అమరనాథ్ టిడిపికి హితవు పలికారు. ఎక్కడో హైదరాబాద్ లో తలదాచుకుంటున్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ల ప్రాపకానికి ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బతీయవద్దని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖపట్టణాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు ఇచ్చిన ఒక నోట్ చూశామని, ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి లభించిన ఒక గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.