ఇచ్చేది తెరాస ప్రభుత్వం… చెప్పుకునేది బీజేపీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చిటికెడంతా ఉప్పువేసి…పప్పంతా నాదేనన్న తీరు బీజేపీ నాయకులదన్నారు. అంగన్ వాడీలకు కేంద్రం ఇచ్చేది రూ.2700 మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ. 10,950 వేతనమని తెలిపారు. హుజూరాబాద్ లో ఈ రోజు అంగన్ వాడీల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అంగన్ వాడీ టీచర్ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకిచ్చే మొత్తంతో సమానమన్నారు. దేశంలో అంగన్ వాడీలకు అత్యధిక జీతాలు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
జీతం పెంచమని అడిగితే గుర్రాలతో తొక్కించిన పాలకులు నాడు ఉంటె… నేడు ప్రగతి భవన్ కు పిలిచి జీతాలు పెంచిన పాలకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనం పెంచారు. అంగన్ వాడీలకు జీతాలు పెంచితే ప్రభుత్వానికి ఆర్థిక భారమని అధికారులు అంటే, పట్టు పట్టి జీతాలు పెంచాల్సిందేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏమిచ్చినా మా కేంద్రమే ఇస్తోందని బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గొప్పగా మాటలుచెప్పే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అంగన్ వాడీ టీచర్ల జీతం రూ. 7800 / మాత్రమే. ఆయాల జీతం రూ. 3950/ మాత్రమే.
గ్యాసి సిలిండర్ ధర రూ950/ కు పెంచడమే కాకుండా సబ్సిడీని 40 రూ తగ్గించింది. త్వరలో అది కూడా ఎత్తివేస్తుంది. గ్యాస్ ధరలు పెరగుదలకు రాష్ట్ర ప్రభుత్వం 350 రూ ట్యాక్స్ వేస్తున్నట్లు దుష్ప్రాచారం చేస్తోందని, గ్యాస్ పై జీఎస్టీ ఐదు శాతం మాత్రమే. అంటే 45 రూ. మాత్రమే. ఇందులో కేంద్రం జీఎసిటీ ఉందన్నారు. బీజేపీ కోతలు వాతలు వేస్తుంటే తెరాస. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు.