టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా నేడు మరో రెండు పతకాలు సాధించింది. హై జంప్ టి-63 విభాగంలో భారత ఆటగాళ్ళు మరియప్పన్ తంగవేలు-రజత, శరద్ కుమార్ -కాంస్య పతకాలు సాధించారు. ఒకే విభాగంలో ఇద్దరు మనదేశానికే చెందిన క్రీడాకారులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ రెంటితో నేడు ఇండియా మొత్తం మూడు పతకాలు సాధించింది. ఉదయం పి-1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్.1 విభాగంలో భారత షూటర్ సింగ్ రాజ్ అధానా కాంస్య పతకం గెల్చుకున్న విషయం తెలిసిందే.
హై జంప్ లో 1.88 మీటర్లతో అమెరికా ఆటగాడు శ్యాం గ్రేవే స్వర్ణం, తంగవేలు 1.86 మీటర్లు (రజతం) శరద్ 1.83 మీటర్లు (కాంస్యం) సాధించారు. 2016 రియోలో జరిగిన పారా ఒలింపిక్స్ లో హైజంప్ ఎఫ్-42 విభాగంలో తంగవేలు స్వర్ణం, గ్రేవే రజతం సాధించడం మరో విశేషం. నేటితో ఇండియా పతకాల సంఖ్య 10కి చేరింది. రెండు స్వర్ణ, ఐదు రజత, మూడు కాంస్య పతకాలు వీటిలో ఉన్నాయి.