వైఎస్ వర్ధంతికి లేని ఆంక్షలు వినాయకచవితి పండుగకు విధించడం సరికాదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో అయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వినాయక చవితి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన పండుగ అని అలాంటి పండుగపై నిబంధనలు పెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం కొన్ని షరతులతో ఉత్సవాలకు అనుమతించిందని, అలా ఇక్కడ ఎందుకు ఇవ్వరని బాబు ప్రశ్నించారు.
దిశ చట్టం పేరుతో సిఎం జగన్ రాష్ట్ర ప్రజలను భ్రమింపజేశారని, ఈ చట్టం ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు రక్షణ కోసం ఈనెల 9న నరసరావుపేటలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. విశాఖ మన్యంలో లాటరైట్ ముసుగులో ఇష్టానుసారం బాక్సైట్ దోపిడీకి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. కరోనా కష్ట కాలంలో పన్నుల పేరుతో ప్రజలపై 75 వేల కోట్ల రూపాయల భారం వేశారని బాబు వివరించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వినాయక చవితిపూజా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేకం విధానాలను నిరసిస్తూ, ప్రభుత్వ మద్యపాన విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.