Monday, February 24, 2025
Homeసినిమా‘టక్ జగదీష్’ కొత్తగా ఉంటుంది : శివ నిర్వాణ

‘టక్ జగదీష్’ కొత్తగా ఉంటుంది : శివ నిర్వాణ

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..

“సరదాగా ఉండే కుర్రాడి కథ ‘టక్ జగదీష్’. అది టైటిల్‌లోనే తెలియాలని అలా ఫిక్స్ చేశాం. ఆ టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం కూడా ఉంటుంది. అది చూసి సెన్సార్ వాళ్లకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాపై మా ఫీలింగ్ మారింది అని చెప్పారు. రేపు సినిమా చూశాక టక్ జగదీష్‌ను చూసే కోణం మారుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. మా ఊరి వాతావరణంలోనే పెరిగాను. తాతగారింట్లో బాబాయిలు, అత్తలు అలా అందరి మధ్య పెరిగాను. నేను చూసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాలని, ఫ్యామిలీ డ్రామాను తీయాలని అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అనుకున్నాను. ఇన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు చూసిన తరువాత కూడా శివ నిర్వాణగా నేను చేస్తున్న ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటే బాగుంటుంది, ఇన్ని సినిమాలు వచ్చాక కూడా ఓ ఫ్యామిలీ డ్రామాను తీసి మెప్పించాలంటే ఏదో కొన్ని కొత్త విషయాలు కూడా ఉండాలి. అందుకే నేను చూసిన ఎమోషన్స్ చూపించాలని అనుకున్నాను” అని శివ వెల్లడించారు.

“కథ, కథనం అనేవి వేరుగా ఉండవు. టైటిల్స్‌లో అలా వేస్తాం కానీ కథ రాసుకునేటప్పుడు రెండూ కలిసే ఉంటాయి. ఇది చాలా బలమైన కథ. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు కూడా ఉంటాయి. ఈ సినిమాలో నాని ఓ సరదా మనిషి. బయటి నుంచి ఏ ప్రాబ్లం అయిన వస్తే ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ. విజిల్స్ పడే సీన్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరు. కానీ ఇప్పుడు నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూస్తాడు. ఇప్పుడు ఓటీటీలో రావడంపై నెగెటివ్ కన్నా పాజిటివ్‌లే చూస్తున్నాను”

“నాని గారితో వెంటనే ఓ సినిమా చేయాలని అనుకున్నప్పుడు.. ఆయన ఆఫీస్‌కు రమ్మన్నారు. పది నిమిషాల్లోనే కథ చెప్పాను. ఆ చెప్పడమే ఓ ట్విస్టుతో చెప్పాను. అది బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నారు. కానీ ఆయన నేను లవ్ స్టోరీ చెబుతాను అని అనుకుని.. నాకు ఎలా నో చెప్పాలా అనుకున్నారు. కానీ చెప్పడమే.. భూదేవీపురం, భూకక్షలు అని చెప్పడంతో నాని ఎగ్జైట్ అయ్యారు. లెక్కలు వేసి ఈ కథను చేయలేదు. ఇది ఇంటెన్స్ కథ. మాస్, ఐటం సాంగులు ఉండవు. ప్రారంభం నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంటారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మధ్య ఉండే కథలు కొత్తగా ఏం ఉంటాయి. ఆ సంఘర్షణను ఎంత కొత్తగా చూపిస్తామనేది ఇంపార్టెంట్. ఇందులో కథనం అందరినీ ఆకట్టుకుంటుంది.”

“బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ గారు చేస్తే బాగుంటుందని ఆయనతో చేయించాను. ‘మజిలీ’ సినిమాకు పాటలు గోపీ సుందర్ చేస్తే.. బ్యాక్ గ్రౌండ్ తమన్ చేశారు. ‘టక్ జగదీష్‌’కు లైట్ హార్టెడ్ మ్యూజిక్ కావాలి.. అలాంటి సీన్లే ఎక్కువున్నాయి. గోపీ గారి మ్యూజిక్ లైట్‌గా ఉన్నా.. ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. అందుకే అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలో ఏముందో ట్రైలర్‌లో కూడా అదే చెబుతాను. అలా చెప్పేందుకు నేను ఎప్పుడూ భయపడను. ఉన్న నాలుగు జోకులు ట్రైలర్‌లో కట్ చేసి, ఉన్న నాలుగు యాక్షన్ షాట్స్ పెట్టి.. తీరా సినిమా చూస్తే ఏంటి ఇలా ఉందని అనుకుంటారు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంది. కమర్షియల్ సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుంది. ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథ చేయబోతోన్నాను. మైత్రీ మూవీస్ నిర్మిస్తారు. కథ ఆల్రెడీ చెప్పేశాను. ‘లైగర్’ పూర్తయిన వెంటనే మా సినిమా మొదలవుతుంది” అని శివ నిర్వాణ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్