ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్) లో ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్ పేరుతో నిర్వహించేవారు. అయితే మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించారు.
కాకినాడ జేఎన్టియూ అధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్ష చాలా పారదర్శకంగా జరిగిందని, ఏ విద్యార్థి నష్టపోకుండా మూల్యాంకనం జరిగిందని మంత్రి సురేష్ చెప్పారు. రెండువారాల్లోపే పరీక్షా ఫలితాలను వెలువరించామని, రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 120 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించామని, ఐదుగురు విద్యార్ధులు కరోనా బారిన పడి పరీక్షలు రాయలేకపోయారని, వారికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సురేష్ వివరించారు.
మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించిన ముఖ్యాంశాలు:
- ఈ-ఎపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్ధులు – 2,59,688 మంది
- ఇంజనీరింగ్ కు దరఖాస్తు చేసుకున్నవారు – 1,75,868 మంది
- ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులు – 1,34,205 మంది
- అనంతపురం విద్యార్థి నిఖిల్ కు మొదటి ర్యాంక్
- శ్రీకాకుళం కు చెందిన మహంత నాయుడుకు రెండో ర్యాంకు
- వ్యవసాయ, ఫార్మసీ ఫలితాలు ఈనెల14 న విడుదల చేస్తాం