ఆగస్ట్ 15 నుండి ప్రారంభమయిన పంటల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయ అధికారులకు ఇతర పనులు అప్పజెప్పవద్దన్నారు. హైదరాబాద్ లోని వ్యవసాయ కమీషనరేట్ కార్యాలయంలో వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి మరియు వానాకాలంలో రాబోయే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై జరిగిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సారి మరింత ఖచ్చితత్వంగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో ధరణిలో సర్వే నంబర్ల వారీ మ్యాపుల ఆధారంగా పంటల నమోదు చేయించడం జరుగుతున్నది
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పంటలన్నీ వేసి ఉన్న నేపథ్యంలో పంటల నమోదు మూలంగా ఖచ్చితత్వం పెరుగుతుందని, పంటల నమోదు పది రోజులలో సంపూర్ణంగా పూర్తి కావాలని మంత్రి సూచించారు.
యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశెనగ మరియు ఇతర నూనెగింజల పంటలైన ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి పంటలతో పాటు పప్పుశనగను ప్రోత్సహించాలని సూచించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తలు. రైతు వేదికలలో జరిగే శిక్షణా తరగతులలో పంటల మార్పిడిపై ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు విస్తృతంగా ఇప్పటి నుండే రైతులలోకి తీసుకెళ్లాలని నిర్ణయం. వేరుశెనగ సాగును పెంచడానికి రాయితీపై విత్తనాలను సరఫరా చేయడానికి గల అవకాశాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.
పెరిగిన సాగు నీటి వసతుల నేపథ్యంలో ఒకే రకమైన పంటలు కాకుండా అన్నిరకాల పంటలు పండించేలా రైతులు తమ సాగు విధానాలను మార్చుకోవాలని, రైతులు స్థానిక పరిస్థితుల ఆధారంగా తప్పనిసరిగా పంటల మార్పిడి విధానాన్ని అవలంభించాలని మంత్రి కోరారు.
ఇకపై ఎఫ్.సీ.ఐ నుండి పరిమితంగానే వరి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయని సమావేశంలో ఎఫ్ సీ ఐ జీఎం దీపక్ శర్మ వెల్లడించారు. ఈ వానాకాలం పంటల నుండి కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, అందులో కూడా బాయిల్డ్ ధాన్యానికి ఉపయోగించే దొడ్డు వడ్ల రకాలను కొనుగోలు చేయమన్నారు.
రాబోయేకాలంలో ఎట్టి పరిస్థితిలో దొడ్డు వడ్లను సేకరించడం కుదరదని సన్న వడ్లను మాత్రమే సేకరించడం జరుగుతుందని దీపక్ శర్మ స్పష్టం చేశారు. ఈ యాసంగిలో వీలైనంత వరకు వరి పంటను సాగు చేయొద్దని, తప్పనిసరి పరిస్థితులలో సన్న వడ్లు తప్ప దొడ్డు వడ్లు అసలు సాగు చేయొద్దన్నారు. ఇప్పటికే ఎఫ్ సీ ఐ ఈ విషయం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయాలని జిఎం కోరారు.
సమీక్ష సమావేశంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, హాజరైన వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఎఫ్ సీ ఐ జీఎం దీపక్ శర్మ, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ , శాస్త్రవేత్తలు డాక్టర్ జగన్మోహన్ రావు, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, ఎండీ అగ్రోస్ రాములు తదితరులు పాల్గొన్నారు.