అక్టోబర్ లో జరగనున్న టి-20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు మహేద్ర సింగ్ ధోని మెంటార్ గా వ్యవహరించానున్నాడు. ఈ టోర్నీకి ఆడే 15 మంది ఆటగాళ్ళ జట్టును బిసిసిఐ ప్రకటించింది. రెండు సార్లు టి-20 వరల్డ్ కప్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన నాటి సారథి ధోనీ అనుభవం వినియోగించుకోవాలని బిసిసిఐ నిర్ణయించింది. అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గత ఏడాది గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ప్రస్తుతం ధోని ఉన్నాడు. చాలాకాలం పాటు మైదానంలో టీమిండియాను నడిపించిన ధోని ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ ద్వారా సరికొత్త పాత్రలో జట్టుకు మారదర్శనం చేయనున్నాడు.
జట్టు విషయానికొస్తే, నాలుగేళ్ళుగా ఇండియా పరిమిత ఓవర్ల జట్టులో చోటు సంపాదించని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఈ టోర్నీకి బిసిసిఐ ఎంపిక చేసింది. టి 20ల్లో తన వంతు పాత్ర పోషించి, ఇటీవల శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ కు మొండి చేయి దక్కింది. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతూ మంచి ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ జట్టు వివరాలను ప్రకటించారు. దుబాయ్ లోని పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయని అందుకే అశ్విన్ కు చోటు కల్పించామని చేతన్ వెల్లడించాడు.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్-కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, మహమ్మద్ షమి
శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లను స్టాండ్ బై ప్లేయర్లుగా బిసిసిఐ నిర్ణయించింది,.
అక్టోబర్ 17నుంచి యూఏఈ, ఒమన్ వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. 24న ఇండియా తన మొదటి మ్యాచ్ ను దాయాది జట్టు పాకిస్తాన్ తో ఆడనుంది.