Friday, September 20, 2024

నిగూఢ రహస్యం

Pegasus: The mysterious secret

ప్రశ్న:-
గూఢచర్యాన్ని ఎలా నిర్వచిస్తారు?
సమాధానం:-
గూఢచర్యాన్ని మేమసలు నిర్వచించం. నిర్ ప్లస్ వచనం…అంటే నిర్వచించడానికి వీలులేనిది నిర్వచించకూడనిది అనే కదా అర్థం!

ప్ర:-
గూఢచర్యం ఎన్ని రకాలుగా చేస్తుంటారు?
స:-
అది అంతర్గత భద్రతకు సంబంధించినది.

ప్ర:-
మేమడిగింది ప్రజల రహస్యాల గురించి?
స:-
అంతర్గత భద్రతలో ప్రజలు కూడా భాగం.

ప్ర:-
అంతర్గత భద్రతకు వాడాల్సిన పెగాసస్ అంతర్లీనంగా అందరికీ వాడారా?
స:-
దేశ భద్రతే మాకు ముఖ్యం.

ప్ర:-
మేమడుగుతున్న ప్రశ్న వేరు?
స:-
మీ భద్రతే మాకు ప్రధానం.

ప్ర:-
గూఢచర్యం- భద్రత రెండూ ఒకటేనా?
స:-
ఒకటే అయినా ఒకటి కాదు. రెండూ అయినా ఒకటే. ఒకటి ఒకటి కలిపితే రెండే.

ప్ర:-
గూఢచర్యంలో భద్రత ఉందా? భద్రతలో గూఢచర్యం ఉందా?
స:-
మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజే ఉంది.

ప్ర:-
మేము బియ్యం అడగలేదే?
స:-
మేము బియ్యం ఇవ్వలేదే! వడ్లే ఇచ్చాము. మీరు దంచితే బియ్యం వచ్చాయి.

ప్ర:-
దంచకుంటే మీరు చెప్పడం లేదు కదా?
స:-
దంచకుంటే బియ్యం రావు కదా?

ప్ర:-
మేమడిగింది వడ్ల రహస్యం కాదు?
స:-
బియ్యం నిగూఢంగా వడ్లలో దాక్కుని ఉంటుందని దేశ భద్రత దృష్ట్యా మేము ప్రతీకాత్మకంగా చెప్పాము.

ప్ర:-
బియ్యంలో దేశ భద్రత దాగుందా? ఎలా?
స:-
బియ్యం వండితే అన్నం. ఆ అన్నం తింటే బలం. ఆ బలమే దేశ భద్రత.

ప్ర:-
ఇందులో రహస్యమేముంది? దీనికి పెగాసస్ ఎందుకు?
స:-
మరి కోరి కోరి వరి ఉరి వేసుకోకుండా ప్రతి వరి వెన్నులో నిఘా పెట్టాల్సి వచ్చింది.

ప్ర:-
పండే ప్రతి గింజమీద గూఢచర్యం ఉందా?
స:-
అది వరి భద్రతకు తప్పనిసరి.

ప్ర:-
మీరేమి చెప్తున్నారో మీకయినా తెలుస్తోందా?
స:-
భద్రత దృష్ట్యా మా మౌనం….

ప్ర:-
మౌనం అంగీకారం అనుకోవాల్సి ఉంటుంది.
స:-
మళ్లీ మౌనం…!!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: నిఘా ప్రపంచం పిలిచింది

Also Read: ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్