బలహీన వర్గాల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి, టిటిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రెండేళ్లుగా బీసీలపై 254 దాడి కేసులు నమోదయ్యాయని, తెలుగుదేశం పార్టీకి చెందిన 11 మంది బిసి నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని వెల్లడించారు. బీసీలకు 56 కార్పోరేషన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటికి కేటాయించిన, ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వం చేనేత సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు నేతన్న నేస్తం పేరుతో నామమాత్రపు ఆర్ధిక సాయం చేసి సబ్సీడీలను ఎత్తివేశారని వివరించారు. 217 జీవో పేరిట మత్స్యకార సహకార సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైందని యనమల ప్రశ్నించారు. గతంలో బీసీ కార్పోరేషన్ ద్వారా ఎన్నో సబ్సిడీలు బలహీన వర్గాలకు ఖర్చు చేశామని, ఈ ప్రభుత్వం బిసీ కార్పోరేషన్ నిధులు దారి మళ్ళించారని యనమల విమర్శించారు.