ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 8న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. 2020 ఫిబ్రవరి లోనే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా, కోవిడ్ కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నాటి ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. 2021 ఏప్రిల్ 1 న కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ నీలం సహానీ ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టారు. గత నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ప్రక్రియను మొదటినుంచి ప్రారంభించాలని ప్రతిపక్షాలు కోరాయి. ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై విపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ మాత్రం జరపవద్దని గతంలో ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నోటిఫికేషన్ విడుదలకు-పోలింగ్ తేదీకి మధ్య నాలుగువారాల సమయం కచ్చితంగా ఉండాలన్న సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదంటూ ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ మే 21న తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీచేసిన కొందరు అభ్యర్ధులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 5న విచారణ పూర్తి చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. కౌంటింగ్ కు అనుమతిస్తూ ఈరోజు తీర్పు చెప్పింది.