Sunday, September 22, 2024
HomeTrending Newsజర్మనీ రాయబారితో కేటిఆర్

జర్మనీ రాయబారితో కేటిఆర్

పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భారతదేశంలో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్ మరియు ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోడ్ అఖతోవ్ లతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి పలు వివరాలు అందించిన మంత్రి కే తారకరామారావు, జర్మనీ దేశంలో పరిశ్రమలు విద్యారంగం వంటి అంశాల్లో ఉన్న ఆదర్శవంతమైన విధానాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమల విజయవంతమైన ప్రస్థానం, వాటి పనితీరు, ఎకానమీలో వాటి పాత్ర, వాటికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరియు విద్యారంగంలో విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధంగా తయారు చేసేందుకు అవలంభిస్తున్న డ్యూయల్ డిగ్రీ వంటి విధానాలను, వాటి వివరాలను తెలుసుకున్నారు. తెలంగాణలోని అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య అనంతరం జర్మనీకి ఉన్నత విద్య కోసం వెళ్తున్నారని, అలాంటి వారికోసం ఇక్కడ ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంద అనే విషయాన్ని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విప్లవాత్మకమైన మార్పులతో, ఆదర్శవంతమైన విధానాలతో అంతర్జాతీయస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామని, ఇప్పటికీ దేశంలోకి అత్యంత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న భారత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. జర్మనీ కి చెందిన ఆటోమొబైల్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పలు కంపెనీల గతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికలో కలిసిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్, జర్మనీ దిగ్గజ కంపెనీలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు, వారికి తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసేందుకు సహకరించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం గురించి ఇక్కడ విధానాల పట్ల ప్రత్యేక ఆసక్తి వ్యక్తం చేశారు జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండార్. ఇక్కడ ఉన్న పారిశ్రామిక అనుకూలత, వినూత్న విధానాల ఆధారంగా మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం మరియు జర్మనీ పారిశ్రామిక వర్గాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కృషి చేస్తామని అంబాసిడర్ హామీ ఇచ్చారు. జర్మనీ రాయబారి తో ఆదేశ  కాన్సుల్ జనరల్ ఇన్ చెన్నై క్యారిన్ స్తోల్ కూడా ఉన్నారు. మంత్రి జర్మనీ రాయబారి బృందానికి జ్ఞాపికను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందజేశారు.

ఉజ్బెకిస్తాన్ కు చెందిన రాయబారి దిల్షోద్ అఖతోవ్ బృందం తోను మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటిస్తున్న ఉజ్బెక్ రాయబారి బృందం తమ దేశంలో ఫార్మా వంటి రంగాలకు ఉన్న  పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా తమ దేశంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి కే తారకరామారావు వివరించిన రాయబారి, ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశ్రామికవర్గాలతో సమావేశమయ్యేందుకు సహకరించాల్సిందిగా కోరారు. మరోవైపు తమ దేశంలో ఉన్న పరిశ్రమలకు ఇక్కడి పారిశ్రామిక వర్గాలను అనుసంధానం చేయడం ద్వారా, అవి మరింత అభివృద్ధిని సాధిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్