Sunday, September 22, 2024
Homeసినిమాసినిమా రివ్యూ : మాస్ట్రో

సినిమా రివ్యూ : మాస్ట్రో

నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ‘మాస్ట్రో’ సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుధాకర్ రెడ్డి – నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, కథానాయికగా నభా నటేశ్ నటించగా, ఒక కీలకమైన పాత్రను తమన్నా పోషించింది. ఆ మధ్య హిందీలో విజయవంతమైన ‘అంధదూన్’ సినిమాకి ఇది రీమేక్. మరి ఆ సినిమా స్థాయిలో ‘మాస్ట్రో’ ప్రేక్షకులను మెప్పించిందా? మేర్లపాక గాంధీ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది? అనేది ఇప్పుడు చూద్దాం.

అరుణ్ (నితిన్) అంధుడిగా నటిస్తూ ఒక సింగిల్ రూమ్ లో సింగిల్ గా ఉంటూ ఉంటాడు. పియానో ప్లే చేయడంలో ఆయనకి మంచి ప్రావిణ్యం ఉంటుంది. సోఫీ (నభా నటేశ్)కి చెందిన ఒక రెస్టారెంట్ లో పియానో ప్లే చేస్తూ, అలా వచ్చిన డబ్బుతో  జీవితం కొనసాగిస్తుంటాడు. ఒకసారి అరుణ్ పియానో ప్లే చేయడాన్ని సీనియర్ హీరో మోహన్ (నరేశ్) చూస్తాడు. మరుసటి రోజు తన పెళ్లిరోజు కావడంతో, తన భార్య సిమ్రన్ (తమన్నా)ను సంతోషపెట్టడం కోసం, తన ఇంటికి వచ్చి పియానో ప్లే చేయమని అడ్వాన్స్ ఇచ్చి వెళతాడు.

మరుసటి రోజు మోహన్ ఇంటికి పియానో ప్లే చేయడానికి అరుణ్ వెళతాడు. ఒక పెద్ద అపార్టుమెంటులో ఖరీదైన ఫ్లాటులో మోహన్ దంపతులు నివాసముంటారు. సిమ్రన్  తప్పనిసరి పరిస్థితుల్లో అరుణ్ ను లోపలికి రానిస్తుంది. లోపల మోహన్ హత్యచేయబడి ఉండటం చూసి, అరుణ్ షాక్ అవుతాడు. ఆమె దృష్టిలో తాను అంధుడు కనుక, ఆ హత్యను తాను చూడనట్టుగానే ఉంటాడు. ఆ హత్యకి కారకులు ఎవరో .. అందుకు కారణం ఏమిటో కూడా ఆయనకి అర్ధమవుతుంది. ఆ సంఘటన ఆయనను ఎలా వెంటాడుతుంది? ఆ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కొంటాడు? అసలు ఆయన అంధుడిగా ఎందుకు నటించవలసి వస్తుంది? అనే అనూహ్యమైన మలుపులతో ఈ కథ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

కథ అంతా కూడా నితిన్ .. తమన్నా చుట్టూ తిరుగుతుంది. నిజాన్ని బయటికి చెప్పలేని పరిస్థితుల్లో నితిన్ .. నిజాన్ని సమాధి చేయాలనే ప్రయత్నంలో తమన్నా తమ పాత్రల్లో జీవించారు. ఇక కథానాయికగా నభా నటేశ్ పాత్రకి గల ప్రాధాన్యత నామమాత్రమే. తమన్నాకు సహకరించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో జిషుసేన్ గుప్తా తనదైన స్టైల్లో మెప్పించాడు. ఇక పేదరికం నుంచి బయటపడానికి అడ్డదారులు తొక్కే మురళీ – సరోజ పాత్రల్లో రచ్చ రవి – మంగ్లీ మంచి మార్కులు కొట్టేశారు. మోహన్ పాత్రలో నరేశ్ కొంతసేపు హడావిడి చేశాడు. కాకపోతే ఆయనకి సెట్ కానీ విగ్గు ఆయనకంటే చూసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

దర్శకుడు మేర్లపాక గాంధీ మూలకథకు ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకువెళ్లాడు. అసలు కథే అయినా .. కొసరు కథే అయినా .. ఎవరూ కూడా అంధుడిగా నటించాలనే ఆలోచన చేయరు. అందుకోసం సింగిల్ రూమ్ లో ఉంటూ .. మనిషి మనిషి ముందు నటిస్తూ నరకం పడరు. పైగా హీరోకంటూ వెనకా ముందు ఎవరూ లేకపోయినా చాలా స్టైల్ గా తన లైఫ్ ను గడిపేస్తూ ఉంటాడు. అంధుడిగా నటించవలసిన పరిస్థితి వస్తే, దాని వెనుక ఒక బలమైన కారణం కనిపించాలి. ప్రేక్షకులకు అది ‘నిజమే సుమీ’ అనిపించాలి.

కానీ తాను అంధుడిగా కనిపించడానికి హీరో చెప్పిన రీజన్ సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాదు. తెలివైన ప్రేక్షకులు కూడా బుర్ర గోక్కోకుండా ఉండలేరు. ఏ విషయమైతే బలంగా చెప్పాలో .. క్లారిటీగా విప్పాలో ఆ విషయాన్నే దర్శకుడు తేలగోట్టేశాడు. ఇక ఆ తరువాత మాత్రం మలుపులు .. ట్విస్టులతో బాగానే రక్తి కట్టించాడు. హీరో నిజంగానే అంధుడా .. కాదా? అని తమన్నా .. జిషు సేన్ గుప్తా టెస్టులు పెట్టే సీన్స్ బాగానే పండాయి. ఇక నభా నటేశ్ వంటి హీరోయిన్ ను పెట్టుకుని, రొమాన్స్ కి పెద్ద చోటు ఇవ్వకపోవడం .. ఉన్న చోటును వాడుకోకపోవడం కూడా కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది.

ఎప్పుడైనా ప్రేక్షకుడు ఈ కథ మనది .. మన దగ్గర జరిగింది అనుకోవాలి. అప్పుడే అతను ఆ కథలో భాగం కాగలుగుతాడు. కానీ రెస్టారెంట్లలో పియానో ప్లే చేయడం .. అది హీరో జీవనోపాధి కావడం ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో అసలు ఈ కథే మనది కాదు అనే ఫీలింగ్ కలగడం సహజం. ఇక ఒక మనిషిని పట్టపగలు మర్డర్ చేసి ..  ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఒక ఖరీదైన అపార్టుమెంట్ నుంచి సీక్రెట్ గా తీసుకెళ్లడం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది.

చివరికి వచ్చేసరికి కథను అన్ని వైపుల నుంచి అల్లుకురావాలనే ఆలోచన .. ఆరాటం, ప్రేక్షకుల  అయోమయానికీ .. అసహనానికి కారణమవుతాయి. కొంతసేపు కిడ్నీ మార్పిడి .. ఆ వెంటనే లివర్ మార్పిడి .. ఆ తరువాత కళ్ల మార్పిడి వ్యవహారంపై క్రియేట్ చేసిన సీన్స్ కంగారు పెట్టేస్తాయి. దర్శకుడు ఇక్కడ కాస్త శ్రద్ధ పెడితే బాగుండదేమోనని అనిపిస్తుంది. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ప్రేక్షకులను సన్నివేశాల్లోకి లాక్కెళుతుంది. జె. యువరాజ్ తన కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా ఆవిష్కరించాడు. ఈ ఇద్దరూ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారనే చెప్పాలి. లాజిక్కులు పక్కన పెట్టేస్తే .. సిల్లీ సీన్స్ ను అవతలకి నెట్టిస్తే .. పల్లీలు తినుకుంటూ సరదాగా కాసేపు చూడదగిన సినిమానే ఇది.

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్