World’s whitest paint, which could help the fight against global warming….తెలుపంటే మనకి గొప్ప ఆరాధన. నలుపు నాణ్యమైంది అని ఎంత మొత్తుకున్నా సరే తెలుపు తెలుపే అనేవాళ్లే ఎక్కువ. అయితే కొన్నిచోట్ల తెలుపే హాయిగా ఉంటుంది. మండే ఎండాకాలంలో తెల్లని దుస్తులు ధరిస్తే వచ్చే హాయే వేరు. వేడి తగ్గించే లక్షణం తెలుపు రంగుకి ఉందని అంగీకరించాల్సిందే. తెల్లని పెయింటు వెయ్యడం ద్వారా ఎండాకాలం మంటలు, ఏసీ ఖర్చు తప్పించ వచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది. చల్లదనం కోసం తెల్లని పెయింట్ వెయ్యడం ఎప్పుడో ఉంది కదా అనుకోవద్దు. ఇది వేరే. పర్ డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్జియులిన్ రూన్ ఆధ్వర్యంలో ఏడేళ్లపాటు ఈ రీసెర్చ్ కొనసాగింది. వాతావరణ మార్పులు అడ్డుకోవడం, ఇంధనం ఆదా లక్ష్యాలుగా ఈ పరిశోధన సాగింది. చివరకు వీరు అతి తెల్లనైన, చల్లనైన పెయింట్ తయారుచేసారు. ఇంతకు మించిన తెల్లని పెయింట్ ప్రపంచంలోనే లేదని గిన్నెస్ బుక్ వారు కూడా ఒప్పేసుకున్నారు. ఇంకా ఈ పెయింట్లో ఎన్నో విశేషాలున్నాయి …
⦿ ఈ అతి తెల్లని ఆక్రిలిక్ పెయింట్ సూర్యకాంతిని, వేడిని 98 శాతం అడ్డుకుంటుంది
⦿ 1000 చదరపు అడుగుల రూఫ్ కి పెయింట్ వెయ్యడం ద్వారా 10 కిలోవాట్ల కు సమానమైన కూలింగ్ వస్తుంది
⦿ ఏసీల వాడకం తగ్గిపోతుంది. పర్యావరణ హితం
⦿ సాధారణ వైట్ పెయింట్ లా కాకుండా సూర్య కాంతిని, వేడిని సమర్థంగా ఎదుర్కొంటుంది
⦿ ఏదేమైనా పెరిగే ఎండలతో అల్లాడే భారత్ వంటి దేశాలకు ఇది చల్లటి తెల్లటి కబురు.
⦿ ఈ పెయింట్ వాడకంలో కొస్తే మల్లెకన్న తెల్లన , మంచుకన్న చల్లన మా ఇంటి సొగసు అని పాడుకోవచ్చేమో!
అలాగే ఇంటికప్పు తెల్లగా ఇంటిలోన చల్లగా బతకరా బతకరా అని ఆశీర్వదించవచ్చు కూడా!