తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిటిడి పాలకమండలిని నియమించింది. 24 మంది బోర్డు సభ్యులు, నలుగురు అధికారులతో కలిపి 28 మందితో బోర్డును నియమించింది. దీనికి అదనంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సుధాకర్ లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జీవో నంబర్. 568, మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ 569 జీవోను కూడా విడుదల చేసింది. ఈ 52 మంది ప్రత్యేక ఆహ్వానితులకు ఓటింగ్ హక్కు ఉండదని, టిటిడి పాలక మండలి సభ్యులు పొందే అన్ని ఇతర ప్రోటోకాల్ మర్యాదలకూ అర్హులని జీవోల్లో ప్రభుత్వం పేర్కొంది.
టిటిడికి జంబో కమిటీని నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ను దెబ్బతీశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర బిజెపి కూడా ఈ విషయంపై హైకోర్టులో విడిగా పిటిషన్ దాఖలు చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 తో పాటు 1987 ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాదాయ ధార్మిక చట్టం సెక్షన్ 96కు ఈ నియామకాలు పూర్తిగా విరుద్ధమని వారు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత జీవోలు 568, 569 లను తాత్కాలికంగా నిలుపదల చేస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.