ways to improve positive thinking
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అన్నారో కవిగారు. ఆ మాట కొందరిలో నిజం. అన్ని విషయాలకు నవ్వుతూ ఆనందంగా ఉండేవాళ్ళను చూస్తే వీళ్ళకి కష్టాలు లేవా అనిపిస్తుంది. మరికొందరైతే వారిని వెటకారంగా రేలంగిమావయ్య అనికూడా వెక్కిరిస్తారు. కానీ అలా ఉండటం వరం. అందరికీ ఆ అదృష్టం ఉండదు. కానీ సానుకూల దృక్పథంతో ఉంటే కష్టాలు తెలియవంటున్నారు నిపుణులు.
ఇప్పటిదాకా ఎలాఉన్నా తెలిసాకైనా కాస్తంత సానుకూల ధోరణి అలవరచుకుంటే ముందు జీవితం ఆనందమయ మవుతుందంటున్నారు. అందుకు ఏం చేయాలో కూడా సూచిస్తున్నారు. ఇదంతా ఒక్కరోజులో కాదు, కానీ ఆచరిస్తే కొంతకాలం తర్వాత మేలైన ఫలితాలు చూడచ్చు. ముఖ్యంగా పాజిటివ్ థింకర్స్ లో ఆరోగ్య సమస్యలు తక్కువని తేలింది. కొన్నిరకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు,శ్వాస సంబంధ వ్యాధులు, గుండెజబ్బుల బారిన పడడం అరుదట.
ఎప్పుడూ ఆనందంగా చలాకీగా ఉండేవారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటమే కారణం. అంతే కాదు, ఒత్తిడిని తట్టుకోగల శక్తీ ఎక్కువే. ఫలితంగా కుంగుబాటుకు లోనవరు. మరి పాజిటివ్ థింకింగ్ పెంచుకోడానికీ కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం
⁃ నెగటివ్ థింకింగ్ లేదా అననుకూల ఆలోచనలు గుర్తించి వాటి స్థానంలో పాజిటివ్ థాట్స్ పెంచుకోవడం
⁃ కొంతమంది ఎప్పుడూ నిరాశగా, వ్యతిరేక ధోరణితో మాట్లాడతారు. ఇది గుర్తిస్తే మార్చుకోడం సులభం. తమలో తామే నిందించుకుంటూ గొణుక్కుంటూ ఉండేవారు ఆ అలవాటు నుంచి వీలయినంత త్వరగా బయటపడాలి. తమ చేతుల్లో లేని విషయాలకు బాధపడటం అనవసరం అని గ్రహించాలి. మంచి మాటలతో ఆలోచనలు నియంత్రించుకోవాలి.
⁃ హాస్యం జీవితంలో భాగం కావాలి. సమస్యలున్నా హాస్యంతో ఎదుర్కొంటే మనసు తేలికవుతుంది
⁃ జీవితమన్నాక చిన్నా చితకా సమస్యలు వస్తూనే ఉంటాయి. మబ్బుల్లా తేలిపోతాయి. ఈ ఆశావహ దృక్పథం ఉండాలి
⁃ మనకు ఎవరివల్లో సమస్యలొస్తున్నాయని నిందిస్తూ చింతించడం కంటే, మనకు సాయం చేసిన వారిని గుర్తు చేసుకోవడం పాజిటివ్ థింకింగ్ పెరగడానికి దోహద పడుతుంది
⁃ ఎంత ప్రయత్నించినా వ్యతిరేక ధోరణి, ఆలోచనలు వీడడం లేదా? అయితే ఇలా చేయండి. ఒక పుస్తకంలో మీకు సంతోషం కలిగించే విషయాలు రాయండి. ఈ చిన్న చిట్కా ఎంత మార్పు తెస్తుందో మీకే తెలుస్తుంది
⁃ మర్చిపోకుండా పై చిట్కాలు పాటిస్తూ ఉంటే త్వరలోనే పాజిటివ్ థింకర్ కావచ్చు. మరికొందరికి స్ఫూర్తి దాతగానూ నిలవచ్చు.
(ఈనాడు వార్త ఆధారం)
-కె. శోభ
Also Read:
Also Read:
Also Read: