పవన్ కళ్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనకోసం తెలుగు సినిమా ఇండస్ట్రీని బలిపెట్టవద్దని పవన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది అయన క్రియేషన్ మాత్రమేనని కొట్టిపారేశారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని అయన స్పష్టం చేశారు. నిన్న రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ స్పందించారు.
ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తాం కానీ ఈ విధంగా మాట్లాడడం సరికాదని, పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని అనిల్ కుమార్ అన్నారు. చిత్రపరిశ్రమలోని కొందరు ప్రముఖులే ఆన్ లైన్ టికెటింగ్ పై ప్రభుత్వంతో చర్చించారని గుర్తు చేశారు. జవాబుదారీతనం రావాలని, అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించారు. ఒక సినిమాలో కేవలం నలుగురైదుగురు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని ఇది ఎంతవరకూ సబబు అంటూ మంత్రి ప్రశ్నించారు.
రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ కి ఒక ఫ్యాషన్ అయిపోయిందని అనిల్ విమర్శించారు. ప్రభుత్వ తీరును మారుస్తాను, నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనిల్ అన్నారు. ఒక పక్క సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమను సిఎం ఇబ్బంది పెడుతున్నాడని ఒక ప్రొజక్షన్ ఇచ్చుకోవడం సరికాదన్నారు. ఇటీవల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీలు, ఒక మండలంలో జనసేన గెలిచిందని, మా అడుగులు మొదలయ్యాయని, తమ విజయ ప్రస్తానం కొనసాగుతుందని పవన్ అంటున్నారని, ఇక్కడ నుంచి పైకెళ్ళేలోపల పార్టీ చాపచుట్టేయడం ఖాయమని అనిల్ ఎద్దేవా చేశారు.