ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారత్ బంద్ లో రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకు కలవడం ఆశర్యకర విషయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. నేటి బంద్ పూర్తిగా విఫలమైందని, ఇవాళ రైతుల కోసం విపక్షాలు పిలుపు ఇచ్చిన బంద్ లో రైతులు ఎవరూ పాల్గొనలేదని అయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు బంద్ లో పాల్గొంటున్న వైసీపీ, టిడిపిలు నాడు పార్లమెంటులో వ్యవసాయ చట్టాల బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చాయని నిలదీశారు.
కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. పంజాబ్, మహారాష్ట్రల్లో కొంత మంది పెట్టుబడి పెట్టి ఉద్యమాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీని అప్రతిష్ట పాలు చేయడానికే ఇలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
రైతుల మాటున కొన్ని స్వార్ధ శక్తులు అనవసరమైన బంద్ చేస్తున్నారని, దీన్ని ఖండిస్తూ బిజెపి వినూత్న కార్యక్రమం చేపట్టింది. రైతుల సాధికారత కోసం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ రైతులతో బంద్ ను నిరసిస్తూ ఆందోళన చేసింది. ప్రధానికి సంఘీభావంగా జిల్లాల్లో నాయకుల రైతులతో ప్లకార్డులు చూపుతూ బంద్ ను వ్యతిరేకించారు.