సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ పై ముందుకు వెళతామన్నారు. పారదర్శకత కోసం, అవకతవకలు లేకుండా అందరికీ న్యాయం చేసేందుకే ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకువస్తున్నామని వెల్లడించారు. టిక్కెట్ డబ్బులు ప్రభుత్వం తమ వద్ద ఉంచుకొని తర్వాత ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఇస్తారంటూ వస్తున్న వార్తలను సజ్జల కొట్టిపారేశారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానంలో ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందని చెప్పారు.
ఆన్ లైన్ టికెటింగ్ ను అందరూ స్వాగతిస్తున్నారని, 100 రూపాయల టికెట్ ను వెయ్యి, రెండు వేలకు అమ్ముకునే వారికే దీనివల్ల ఇబ్బందులు ఉంటాయన్నారు. తమ స్వార్థం కోసమే ప్రభుత్వంపై బురద జల్లాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నించారని, అయితే తెలియకుండా తనమీద తానే బురద జల్లుకున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. పవన్ తీరు సినీ పరిశ్రమలోనే కొందరికి నచ్చడం లేదన్నారు, సిఎం జగన్ తో సమావేశానికి సినీ ప్రముఖులు ఎప్పుడు వచ్చినా ఆహ్వానిస్తామని, వారి సమస్యలపై చర్చించేందుకు సిఎం సిద్దంగా ఉన్నారని సజ్జల వివరించారు.
బద్వేల్ ఉప ఎన్నికను సీరియస్ గానే తీసుకుంటామని, సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో చనిపోయిన దృష్ట్యా విపక్షాలు పోటీ పెట్టకపోవడమే మంచిదని సజ్జల సలహా ఇచ్చారు. తాము చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళతామని, ప్రజల ఆదరణ, అభిమానం తమవైపు ఎప్పుడూ ఉంటాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.