ఈనెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున అభ్యర్ధిని పోటీకి నిలపడం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందినందున ఈ ఉప ఎన్నిక వచ్చిందని, దివంగత ఎమ్మెల్యే భార్యకే వైసిపి టికెట్ ఇచ్చినందున తాము పోటీ చేయడంలేదన్నారు. బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ అన్నారు. అన్ని పార్టీలు దీనిపై ఆలోచించాలని, అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే బద్వేల్ విషయమై బిజెపి నేతలు సోము వీర్రాజు, మధుకర్ లు పవన్ తో చర్చించారు. ఉమ్మడి అభ్యర్ధిని బరిలో నిలుపుతామని వీర్రాజు ప్రకటించారు. కానీ ఇప్పుడు తాము బరిలో లేమని పవన్ కళ్యాణ్ ప్రకటించడం గమనార్హం.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో జన సేన పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలు తనకు శత్రువులు కాదని, పరిపాలన బాగా లేదు కాబట్టే అడుగుతున్నామన్నారు. అధికార యంత్రాంగం, పరిపాలన సరైన దిశలో లేవని అన్నారు. రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలను భయపెడితే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో మార్పు తీసుకువచ్చేందుకు జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీమలో సిఎం క్యాంప్ ఆఫీస్, అధికారులు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.