రెండున్నరేళ్ళలో ప్రభుత్వం ప్రజలపై 36,102 కోట్ల రూపాయల పన్నుల భారం మోపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అయన డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ప్రజలకు భారంగా మారిందని పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ కూడా తగ్గించామని అయన గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ తమ పోరాటం ఆగదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నెలాఖరు వరకూ నిరసన కార్యక్రమాల షెడ్యూల్ ను రూపొందించామని చెప్పారు.
ఈనెల 11 నుంచి 17 వరకు గ్రామ, మండల కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. 18 నుంచి 24 వరకు తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు గ్రామాల్లో పర్యటించి విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 25 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర జోనల్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిన్న జరిగిన పోలిట్ బ్యూరో సమావేషంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.