Friday, November 22, 2024
HomeTrending Newsఅసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు

ముఖ్యమంత్రి, శాసనసభాపక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా గత రెండ్రోజులుగా పచ్చి అబద్దాలు వల్లిస్తూ రాష్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కూడా అవమానించేలా మాట్లాడుతూ సభా సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పద్మశ్రీ అవార్డుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, ప్రధానమంత్రి, హోంమంత్రితో మాట్లాడినా ఫలితం లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనూ బండి సంజయ్ తప్పుపట్టారు. దీంతోపాటు పర్యాటక రంగం అభివ్రుద్ధి, విమానాశ్రయాల అనుమతి సహా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని స్పష్టం చేస్తూ బండి సంజయ్ మంగళవారం రాత్రి గణాంకాలతో సహా వాస్తవాలను వెల్లడించారు.

అవేమిటంటే…

గతంలో ధన వంతులకు, కార్పొరేట్లకు పద్మ అవార్డులు వచ్చేవి. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు పేదలైతే వారికి పద్మ అవార్డులు దక్కేవి కాదు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం పైరవీలకు తావు లేకుండా నిజమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి పద్మశ్రీ అవార్డులకు అర్హులను గుర్తిస్తోంది. ఇందులో ఎవరి సిఫారసులూ నడవవు. ప్రధాని కూడా సిఫారసులు చేయరు. అంతా పారదర్శకమైన విధానాన్ని అవలంబించడంవల్లే మన రాష్ట్రం నుండి పేదలైనప్పటికీ వనజీవి రామయ్య, ఆసుయంత్ర స్రుష్టికర్త చింతకింద మల్లేశం వంటి నిష్ణాతులను పద్మ అవార్డుల వరించాయి. ఇంత పారదర్శకంగా పద్మ అవార్డులిస్తుంటే ప్రధానిని నిందించడం ఎంత వరకు కరెక్ట్ ? నిజంగా అర్హులుంటే కేంద్ర కమిటీకి సిఫారుసు చేయాలే తప్ప అసెంబ్లీ సాక్షిగా ప్రధానిని అవమానించేలా మాట్లాడటం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శనం.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనడం శుద్ధ అబద్దం. పర్యాటక రంగంవల్ల లాభాలు ఎలా వస్తాయోననే విషయం 1998లోనే నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే చెప్పారు. కావాలంటే డాక్యుమెంట్స్ తెప్పించుకోండి. దార్శనికతకు మోదీ నిదర్శనమైతే… సంకచిత స్వభావానికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్.
కేసీఆర్ కు సోయి లేనప్పుడే విదేశాంగ మంత్రి జై శంకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు యునెస్కో సభ్యదేశాలు 24 ఉంటే వాటిలో 19 దేశాలను ఒప్పించి మెప్పించి వరంగల్ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు. ఈ ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానిది కాదా?
అలంపూర్ జోగులాంబ దేవాలయానికి కేంద్రం రూ.60 కోట్ల నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక తప్పిదాలతో ఆలస్యమైన మాట వాస్తవం కాదా? అయినప్పటికీ జోగులాంబ ఆలయ అభివ్రుద్ది కోసం ఇప్పటికే రూ.8 కోట్ల నిదులను విడుదల చేసింది నిజం కాదా?
రాష్ట్రంలో టూరిజం అభివ్రుద్దిపై కిషన్ రెడ్డితో ఒక్కసారైనా మాట్లాడావా? కనీసం ఒక్క ప్రతిపాదననైనా పంపావా? ఇంగిత జ్ఝానం లేకుండా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
మీకు శాతవావనులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, చాళక్యులు, ముసునూరి నాయకులు, రాచకొండ పద్మనాయకుల చరిత్ర అక్కర్లేదు. మీక్కావాల్సింది అరాచక పాలన చేసిన నిజాం చరిత్ర మాత్రమే. అందుకే గొల్లకొండ చరిత్రను తెలంగాణ ప్రజలకు చాటి చెబుతాం.
కేంద్ర మంత్రిని ఇంటికి పిలిచి తిండి పెట్టి అడిగినా విమానాశ్రాయాలకు గుర్తింపు ఇస్తలేరంటూ అవమానిస్తావా? నీ ఆహ్వానాన్ని మన్నించి ప్రగతి భవన్ కు వస్తే కేంద్ర మంత్రిని ఉద్దేశించి అవమానకరంగా అసెంబ్లీలో దిగజారి మాట్లాడతారా? ఇదేనా మీ సంస్కారం? తెలంగాణలో 6 విమానాశ్రాయల ఏర్పాటు విషయంలో కేంద్రం ఇప్పటికే సాంకేతికంగా క్లియరెన్సులు ఇచ్చినా మీ నిర్లక్ష్యం వల్లే అనుమతుల విషయంలో ఆలస్యమవుతుందే తప్ప కేంద్రం వల్ల కానేకాదు. దీనిపైనా అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడతావా?
ఈరోజు ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం జరిగితే ‘రాష్ట్రంలో రైళ్ల నిర్మాణం నత్త నడకన సాగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని జీఎం చెప్పారు. అందులో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ అభివ్రుద్ధి విషయంలో సంపూర్ణంగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతవల్లే అనుమతులు తీసుకోవడంలో ఆలస్యమవుతోందని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి.
ఇప్పటికే 1.51 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చాం. 1.31 లక్షల మంది ఆల్రెడీ జాయిన్ అయ్యిండ్రు. అసెంబ్లీలో పేర్లు, సెల్ ఫోన్ల నెంబర్లతోసహా జాబితా ఇస్తాం. జోనల్ విధానం వచ్చాక మరో 70 నుండి 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.
బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ….. ప్రభుత్వంలోని 31 శాఖల్లో మొత్తం 4,91,304 ఉద్యోగులుండాలి. కానీ 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇంకా 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా (మొత్తం పోస్టుల్లో 39 శాతం) ఉన్నాయని చెప్పిన మాటను విస్మరించారా? పనిచేస్తున్న 3 లక్షల మంది ఉద్యోగుల్లోనూ దాదాపు లక్ష మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులేనని కమిటీ వెల్లడించిన కఠోర వాస్తవాలను ఎందుకు దాస్తున్నట్లు?
ఇది గాక మీ ప్రభుత్వ నిర్వాకం, మీ అరాచక, నియంత పాలనవల్ల ఫిల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్వచ్ఛ కార్మికులు, స్టాఫ్ నర్సులుసహా దాదాపు 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను రోడ్డున పడేసిన మాట వాస్తవం కదా?
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి డీఎస్సీ పోస్టుల భర్తీ చేయకుండా, పదేళ్లుగా గ్రూప్-1, 8 ఏళ్లుగా గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయకుండా లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు వల్లిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే….రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? మంజూరైనవెన్ని? భర్తీ చేసినవెన్ని? శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్