తమిళనాడు డిఎంకె, అన్నాడిఎంకే తరహాలో ఐతే మీరు, కాకపొతే మేము అన్నట్లుగా రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల తీరు ఉందని బిజెపి జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, వైసీపీ పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై తాము మాత్రమే పోరాటం చేస్తున్నామని చెప్పారు.
బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సత్య కుమార్ ప్రకటించారు. బద్వేల్ లో పోటీ చేయాలని జనసేనను కోరామని అయితే వారు పొత్తులో భాగంగా తమనే పోటీ చేయాలని సూచించారని సత్య చెప్పారు. ఉపఎన్నికకు అందరికంటే ముందే అభ్యర్ధిని ప్రకటించిన తెలుగుదేశం తీరా నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోటీనుంచి విరమించుకోవడానికి గల అసలైన కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వారి చెబుతున్న అంశాలు సహేతుకంగా లేవని, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని వ్యాఖ్యానించారు. బద్వేల్ లో బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని బిజెపి నేతలు ప్రారంభించారు, ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు.
బద్వేల్ ఉపఎన్నికల్లో పోటీ వైసీపీ, బిజెపి మధ్యే ఉంటుందని, కాంగ్రెస్ పోటీ నామమాత్రమేనని బిజెపి రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ అన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడైన పనతల సురేష్ ను బరిలో దించామని, జగన్ ప్రభుత్వ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలని వెల్లడించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం లేదని, వైసీపీ నేతల బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఉన్నది తోలు మందం ప్రభుత్వమని, ఎవరిమాటా లెక్క చేయడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు, నరేగా విషయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసిందని కానీ ఈ ప్రభుత్వం వారికి ఇవ్వడం లేదని అయన ఆరోపించారు. బద్వేల్ లో ఓ మంచి అభ్యర్ధిని ఎంపిక చేసి బరిలోకి దించుతున్నామని, బిజెపిని గెలిపించాలని కోరారు.