కేంద్ర పంటల భీమా విధానం మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలని .. ఫాం వైజ్ .. ఫార్మర్ వైజ్ ఇన్సూరెన్స్ విధానం మీద అధ్యయనం చేయాలని మంత్రి కోరారు. శాసనసభలో సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, అబ్రహం, రాజాసింగ్, రఘునందన్ రావు, సీతక్క, మెతుకు ఆనంద్ లు పంటనష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనలపై వేసిన ప్రశ్నలకు ఈ రోజు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గుండుగుత్తగా ఏరియా, గ్రూపు వైజ్ ఇన్సూరెన్స్ ల మూలంగా కంపెనీలకు డబ్బులు కట్టడమే తప్ప రైతులకు మేలు జరగడం లేదని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వాహన ప్రమాద భీమా, అగ్ని ప్రమాద భీమా తరహాలో రైతు కేంద్రంగా ప్రీమియం అంచనాతో కొత్త విధానం తేవాలని మంత్రి నిరంజన్ సూచించారు. రైతు కట్టిన ప్రీమియం కన్నా పరిహారం తక్కువ వస్తుందని.. అందుకే కేంద్రం అప్షనల్ చేసి చేతులు దులుపుకుని నెపం రాష్ట్రాల మీద నెట్టిందని ఆరోపించారు. ఫసల్ భీమా కింద 2016 – 17, 2017 -18 లకు గాను తెలంగాణ ప్రభుత్వం భీమా ప్రీమియం చెల్లించింది .. రైతులకు భీమా పరిహారం డబ్బులు వచ్చాయని తెలిపారు. 2018- 2019, 2019 – 20 కి గాను చెల్లించాల్సిన డబ్బులు కొన్ని చెల్లించింది.. మిగతావి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది .. త్వరలోనే చెల్లించడం జరుగుతుందన్నారు.
గత ఏడాది కేంద్రప్రభుత్వం ఫసల్ భీమా పథకాన్ని అప్షనల్ చేసింది .. దీంతో దేశంలోని గుజరాత్, పంజాబ్, ఏపీ, బీహార్, పశ్చిమబెంగాల్ , జార్ఖండ్ , తెలంగాణ రాష్ట్రాలు దీన్నుండి వెనక్కు వెళ్లాయని, ప్రపంచంలో రైతుకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ .. రైతులు అప్పుల నుండి బయట పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 52.5 శాతం రాష్ట్రంలో కౌలురైతులు అన్న వాదన శుద్ద తప్పు .. రాష్ట్రంలో రైతుల వివరాలన్నీ వ్యవసాయ శాఖ వద్ద నమోదై ఉన్నాయి .. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇన్ని వివరాలు , ఇంత శాస్త్రీయంగా లేవు .. ప్రతి కుంట .. కుంట నమోదై ఉందన్నారు.
92.5 శాతం రైతాంగం సన్న, చిన్న కారు రైతులు ఉన్నారు .. విపక్షాల వద్ద కౌలు రైతుల వివరాలు ఉంటే సమర్పించాలన్నారు. కౌలు రైతులు ఉంటే ఏడాదికేడాదికి ఒప్పందాలుంటాయి .. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా అచ్చంగా కౌలు రైతుల పరిస్థితి తెలంగాణలో ఉండదన్నారు.