ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద అంబులెన్సుల అనుమతికి మార్గదర్శకాలు రూపొందిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది.
అంబులెన్సులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగ, హైకోర్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా జాతీయ రహదారుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. NHAI చట్టం ప్రకారం జాతీయ రహదారులపై కదలికలను రాష్ట్రాలు నియంత్రించలేవని వెల్లడించింది.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సర్క్యులర్ ఎలా జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి తమ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందన్న హైకోర్టు.. విజయవాడ, హైదరాబాద్ మార్గం మొత్తం నేషన్ హైవే అని, అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని వెల్లడించింది. అంబులెన్స్ లను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు భారత దేశం లో ఎక్కడా ఇలాంటి సర్క్యులర్ ఇవ్వలేదని వ్యాఖ్యానించింది.
ఈ పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఏపీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. అంబులెన్సులు అపోద్దని తెలంగాణా ప్రభుత్వానికి అదేశాలిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా వేసింది.