సాగునీటి సంఘాల సందర్శనకు టిడిపి సమాయాత్తమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టించిన సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఈ పర్యటన చేపడుతున్నట్లు వెల్లడించింది. పార్టీ ముఖ్య నేతలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతల మధ్య చర్చ జరిగింది. కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పరిపాలనలో ప్రజలకు అప్పులు, జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయని వ్యాఖ్యానించారు.
రాంకీ, హెటిరో సహా బినామీ కంపెనీల్లో వేల కోట్ల నలధనం బయటపడిందని, రెమిడెసివర్ ఇంజక్షన్లలో బ్లాక్ మార్కెటింగ్ వెలుగు చూసిందని చంద్రబాబు అన్నారు. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా మన్యంలో 25 వేల ఎకరాల్లో గంజాయి… చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఓపియం సాగువుతున్నట్లు పలువురు నేతలు సమావేశంలో చెప్పారు. ఈ ప్రభుత్వ పాలనలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం వేశారని… తిరుమల, ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.