గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పోయిన సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని యధావిధిగా ఈ సంవత్సరం కూడా ఆ కేంద్రాలన్నింటీ ద్వారా ధాన్య సేకరణ జరపాలని సిఎం పౌర సరఫరాల శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని సిఎం ప్రకటించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సిఎం సూచించారు. మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరగడానికి కావలసిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని అన్నారు.
సోమవారం ప్రగతిభవన్ లో ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.