Sunday, January 19, 2025
HomeTrending Newsఘనంగా శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలు

ఘనంగా శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్సవాలు

ఉత్త‌రాంధ్ర ప్రజల క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌ల‌ ఇల‌వేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కాసేపట్లో ప్రారంభం కానుంది. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావులు అమ్మవారి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పైడిత‌ల్లి ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది సిరిమానోత్సవం విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తూ వస్తోంది. దీని రాష్ట్ర పండుగగా గుర్తించారు. రెండువందల డెబ్భై సంవత్సరాలుగా ఈ ఉత్సవం నిరాటంకంగా జరుగుతూ వస్తోంది. విజయదశమి అనంతరం వచ్చే మంగళవారం రోజున ఈ సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

అమ్మవారుగా ప్రజలు ఆరాధించే పైడితల్లి విజయనగరం పూసపాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. తన అన్న విజయరామరాజు పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్దానికి వెళతాడు, ఈ చర్య పైడితల్లిని కలవరపెట్టింది. యుద్ధం వద్దంటూ అన్నను ప్రాధేయపడింది. చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయక విజయరామరాజు 1757 లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో విజయం విజయరామరాజునే వరించింది. ఆరోజు రోజు రాత్రి పైడి తల్లికి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పింది. ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమెకు తన అన్న విజయరామరాజు మరణ వార్త తెలుస్తుంది. దీనితో ఆమె అపస్మారక స్థితిలోకి వెళుతుంది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయింది. అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.

క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు బైటకు తీశారు. విజయనగరం మూడు లాంతర్ల కూడలి వద్ద 1757లో పైడితల్లి అమ్మవారి దేవాలయం నిర్మించారు. 1758లో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవం చాలా ప్రాముఖ్యమైనది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.

పతివాడ అప్పలస్వామి నాయుడు అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుప‌ల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్