Sunday, September 22, 2024
HomeTrending Newsఆర్ధిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి : ఐవైఆర్

ఆర్ధిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి : ఐవైఆర్

రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా రావడం సాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం విడిపోయేనాటికి ఏపీకి బదలాయించబడిన అప్పు షుమారు 86 వేల కోట్ల రూపాయలని, చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో 1 లక్షా 53 వేల కోట్ల రూపాయల అప్పు చేశారని,  జగన్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో 1 లక్షా 45 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, రాష్ట్రం మొత్తం అప్పులు 5 లక్షల 23 వేల కోట్ల రూపాయలకు చేరాయని ఐవైఆర్  వివరించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు మరో లక్ష కోట్ల వరకూ ఉంటుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అప్పు రాష్ట్రం నెత్తిన ఉంటే ఇది ఎలా తీరుస్తారని, దీనికేమైనా ప్రణాళిక ఉందా అని అయన ప్రశ్నించారు. ఆర్ధిక వనరులు పెంచడం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని అయన ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పు తేవడం, పంచడం కోసమే అయితే దానికి ప్రభుత్వామే ఉండాల్సిన అవసరమే లేదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పంచుకుంటూ పోతే కొంత కాలం తరువాత పంచడానికి ఏమీ మిగలదని ఎద్దేవా చేశారు.  కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అందుకునే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని, బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరి పోతుంటే మౌలిక సదుపాయాల మాటేమిటిటని అడిగారు. రోడ్ల దుస్థితి, ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుందని విమర్శించారు.  రాష్ట్ర బడ్జెట్లో పెన్షన్లు జీతాల అప్పుల పై వడ్డీలు చెల్లించేందుకు 35% సరిపోతుందని, భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పు గా ఇవ్వాలని అడుగుతున్న అధికారులు, ఇకపై తమ నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అయన వ్యంగ్యంగా అన్నారు.  చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్రదండం గాని అల్లావుద్దీన్ అద్భుతదీపం గాని లేవని గ్రహించాలని హితవు పలికారు.  సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదని, కేంద్ర ప్రభుత్వ తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చని సూచించారు. ఇకనైనా ప్రభుత్వం ఆర్ధిక స్థితిపై దృష్టి సారించకపోతే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుందని అయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్