చట్టం ముందు అందరూ సమానులే అని… చంద్రబాబు, ఎల్లో మీడియా మద్దతు ఉన్నంతమాత్రాన ఎంపి రఘురామ కృష్ణరాజు నిర్దోషి కాలేదని వైఎస్సార్సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు నేరానికి పాల్పడుతున్నప్పుడుగానీ, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగారి పైన బూతు పదజాలం ఉపయోగించినప్పుడుగానీ ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు.
నేరానికి పాల్పడ్డరని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు పోలీసులు ఎవరినైనా అరెస్టు చేస్తారని, ప్రభుత్వం మీద రాజద్రోహానికి పాల్పడ్డాడన్న నేరానికి సంబంధించి సీఐడీ పోలీసులు అరెస్టు చేస్తే.. హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ కొట్టివేసి దిగువ కోర్టుకు వెళ్ళమని చెప్పిందని రాంబాబు గుర్తు చేశారు.
హైకోర్టులో బెయిల్ తిరస్కరించడంతో అప్పటివరకు బాగా నడిచిన రఘురామకృష్ణరాజు డ్రామాలకు తెరలేపారని, సిఐడి కోర్టుకు వచ్చేటప్పుడు కుంటడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు.
రఘు రామరాజు కాలికి అయిన గాయాలపై వెనకా ముందు కూడా ఆలోచించకుండా, దున్నపోతు ఈనిందనగానే.. దూడను కట్టేయమన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు అంబటి.