Sunday, September 22, 2024
HomeTrending Newsకేసీఆర్ పథకాలు దేశంలోనే రోల్ మోడల్

కేసీఆర్ పథకాలు దేశంలోనే రోల్ మోడల్

ఈరోజు టి ఆర్ ఎస్ కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. తెలంగాణ కోసమే పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఏడున్నర ఏళ్లుగా అద్భుతమైన పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి కి ద్వి దశాబ్ది శుభాకాంక్షలు.

కష్ట నష్టాలకోర్చి తన మేధస్సుకు పదను పెట్టి తెలంగాణ దశ మారుస్తున్న మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి కే సీ ఆర్ మరోసారి టీ ఆర్ ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవం గా ఎన్నిక కావడం మనకందరికీ గర్వ కారణమని పార్టీ సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. ఎందరో నేతలు వచ్చారు.. పోయారు.కానీ కేసీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకడం మాత్రం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న టిఆర్ఎస్ ప్లీనరీ లో కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు. అంతకు ముందు సభా వేదిక పై పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు, తెలంగాణ తల్లికి నివాళ్ళు అర్పించిన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ నేతలు.

కేశవరావు ప్రసంగం ఆయన మాటల్లోనే….

ప్రమాదపు అంచుల్లో ఉన్న తెలంగాణ అస్థిత్వాన్ని తన శక్తి యుక్తులతో నిలబెట్టిన పోరాట యోధుడు కేసీఆర్ అనడం లో ఎలాంటి సందేహం లేదని కేశవరావు చెప్పారు. అంతా చీకటి అలముకున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు త్యాగాల పునాదులనే ఆయన నమ్ముకున్నారు. హింస లేని ఉద్యమాలు తమ గమ్యాన్ని చేరుతాయనే విశ్వాసంతో పూర్తి గాంధేయ పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఫలితం రాబట్టిన నేత కేసీఆర్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పడమూడేళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ తోవ ను వీడకుండా టీ ఆర్ ఎస్ ను ఓపికతో సంయమనం తో నడపడం కేసీఆర్ కే చెల్లింది. జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ ఉద్యమ పంథా ను ఎప్పటికపుడు మార్చి కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసిన పార్టీ టీ ఆర్ ఎస్ …నాయకుడు కేసీఆర్.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని విప్లవాలు తెలంగాణ ఉద్యమంలొనే కనిపించిన పరిస్థితిని మనం చూశాం. సాంస్కృతిక విప్లవంతో తెలంగాణను రీ డిస్కవర్ చేసి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పార్టీ టీ ఆర్ ఎస్ . దేశం లోని ఇతర ప్రాంతీయ పార్టీ లకు ధీటుగా టీ ఆర్ ఎస్ నిలిచి గెలిచింది తద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని నిలబెట్టగలిగింది. పడమూడేళ్లు ఉద్యమం..ఏడున్నరేల్ల పాలనతో టీ ఆర్ ఎస్ ను సబ్బండ వర్గాల పార్టీ గా కేసీఆర్ తీర్చిదిద్దారు. తెలంగాణ వారికి పాలించు కోవడం చేత కాదు అని అహంకారం తో విమర్శించిన వారికి ప్రజలే కేంద్రం గా అద్భుతమైన పాలన అందిస్తూ ఇదీ తెలంగాణ అని చాటిన నేత కేసీఆర్. కొందరు విజన్ ను కాగితాలకే పరిమితం చేస్తే కేసీఆర్ త్రికరణ శుద్దితో తెలంగాణ రాష్ట్రం గా అవతరించిన రోజు నుంచే తన అభివృద్ధి కార్యాచరణ కు నడుం బిగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాధమిక లక్ష్యాలు ఈ ఏడేళ్లలోనే చాలా వరకు నెరవేరాయంటే అదీ ఆషా మాషీ వ్యవహారం కాదు.

అల్లావుద్దీన్ అద్భుత దీపం తో తెలంగాణ లో అభివృద్ధి సంక్షేమం అమలు కావడం లేదు. కేసీఆర్ లోఅణువణువునా ఉన్న తెలంగాణ తపనే అన్ని రంగాల్లోగొప్ప గొప్ప ఫలితాలు సాధించడానికి కారణం తప్ప మరొకటి కాదు. కరెంటు కష్టాలు పోయాయి. నీళ్ల కష్టాలు ఇపుడు తెలంగాణ లో లేవు. వ్యవసాయం లో తెలంగాణ ఇపుడు అగ్రభాగాన నిలబడింది. ఎటూ చూసినా పచ్చదనం తో తెలంగాణ పల్లెలు మురిసిపోతున్నాయి. కేసీఆర్ పథకాలు తెలంగాణ దేశం లోనే అత్యంత ప్రజాదరణ పొంది రోల్ మోడల్ గా మారాయి. దళారీ ల వ్యవస్థ కు ముగింపు పలికి పారదర్శకంగా ప్రజల ముంగిట్లోకే పథకాలు వెళ్లేలా కేసీఆర్ చేస్తున్న కృషి కి తగ్గ ఫలితాలు వస్తున్నాయి.2014 లో తెలంగాణ సాధించిన పార్టీ గా టీ ఆర్ ఎస్ 63 సీట్లతో అధికారం లోకి వస్తే చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో 2018 లో 88 సీట్లతో ప్రజాభిమానాన్ని మరింత సంపాందించుకున్నది. కేసీఆర్ పాలనా దక్షత కు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?పాలనా వికేంద్రీకరణ కు వీలుగా జిల్లాలు ,రెవెన్యూ డివిజన్లు ,మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య ను పెంచడం తో అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యాన్ని కేసీఆర్ పెంచగలిగారు. సాగు నీటి ప్రాజెక్టు లను శరవేగంగా పూర్తి చేస్తున్న ఫలితంగా తెలంగాణ రూపు రేఖలు మారుతున్నాయి.ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల కు నిలయంగా ఉన్న తెలంగాణ నేడు అన్నదాతల కు స్వర్గధామంగా మారుతోంది. అభివృద్ధి, సంక్షేమం కనబడని వాళ్లే టీ ఆర్ ఎస్ పాలనను కేసీఆర్ తీరు ను విమర్ధిస్తున్నారు. ఏ పార్టీ లో ఉన్న నాయకుడు అయినా గుండె మీద చేయి వేసుకుని ఒక నిమిషం ఆలోచిస్తే అప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు ఉన్న తేడా అర్థమవుతుంది.

ఇంత తక్కువ పాలనా కాలం లొనే ఇంత ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇందుకు ప్రతి తెలంగాణ పౌరుడు టీ ఆర్ ఎస్ కార్యకర్త గర్వించాలి. కేంద్ర ప్రభుత్వ పరంగా ఏ గణాంకాలు చూసినా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు జాతీయ స్థాయి కన్నా మెరుగ్గానే ఉన్నాయి. తలసరి ఆదాయం పెరిగింది. gsdp రెట్టింపు అయ్యింది. దేశానికి అధిక ఆదాయాన్నిస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ చేరడం ఉట్టి మాటలతో సాధ్యం కాలేదు.. కేసీఆర్ గట్టి సంకల్పం తోనే సాధ్యపడింది. అప్పుల విషయం లో కొందరు చేసే విమర్శలు అర్థం లేనివి. కేంద్ర నిబంధనలకు లోబడే తెలంగాణ అప్పులు చేస్తోందని పార్లమెంటు వేదిగ్గా మంత్రులే గణాంకాలతో సహా వివరించారు. కేసీఆర్ ను విమర్శిస్తున్న నేతలు ముందు తమ పార్టీ లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు తెలంగాణ కంటే మేలైన పాలన ఇస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ ఉనికిని చాటుకునేందుకు కొందరు ఉద్యమ వీరుడు, అభివృద్ధి సూరీడు అయిన కే సీ ఆర్ ను అకారణంగా unparlamentary భాష తో నిందిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాజకీయాలు తిట్ల రహితంగా సాగాలి. సోషల్ మీడియా ను తిట్ల కోసం కాకుండా నిర్మాణాత్మక సూచనలకు వేదిగ్గా మార్చుకుంటే అందరికీ మంచిది. మంచిని మంచి అనడం నేర్చుకుంటేనే రాజకీయాల్లో ఎవరికైనా మంచిది.

ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందబట్టే అన్ని స్థాయిల్లో టీ ఆర్ ఎస్ నభూతో న భవిష్యత్ అన్న రీతి లో విజయాలు నమోదు చేసుకుంది. వరసగా ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని కోల్పోతున్న పార్టీ లు కేసీఆర్ మీద నోరు పారేసు కుంటే లాభం లేదు. లోపాలు ఏక్కడున్నాయో వెతుక్కుంటే మంచిది. టీ ఆర్ ఎస్ శ్రేణులు ఈ ద్విదశాబ్ది వేడుకలను ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వాడుకోవాలని విజ్ఞప్తి. మనం చేస్తున్నది కొండంత చెప్పుకుంటున్నది గోరంత అనే భావన చాలా మంది లో ఉంది. చేసింది దైర్యంగా చెప్పుకోవాలి. సామాన్య ప్రజలే మనకు స్టార్ కాంపెయినర్లు అయినా పార్టీ శ్రేణులు నిరంతర ఉత్సాహం తో పని చేయాలి. గులాబీ జెండా నీడన మనం ఉన్నాం ఈ జెండాను ఎల్లవేళలా కాపాడుకోవాలి అన్న స్పృహ ప్రతి కార్యకర్తకు ఉండాలి. మనం పార్టీ ని ప్రేమిస్తే పార్టీ తప్పకుండా మనల్ని ప్రేమిస్తుంది. కేసీఆర్ స్థానం తెలంగాణ సమాజం లో అగ్రభాగాన ఉంది.. ఇకపై కూడా ఉంటుంది. తెలంగాణ ఆత్మ కేసీఆర్. తెలంగాణ గుండె కేసీఆర్.. ప్రజల మది లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కేసీఆర్ నాయకత్వం లో పార్టీ రానున్న రోజుల్లో మరింతగా బలపడి అప్రతిహత విజయాలు సాధించాలని కోరుకుంటున్న. తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చాలని అలుపెరగకుండా శ్రమిస్తున్న కేసీఆర్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కేశవరావు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్